కాటన్ బట్టలు ఒక్క ఉతుక్కే రంగు పోతున్నాయా? ఈ చిట్కాలతో ఉతికి చూడండి రంగు పోయే ఛాన్సే లేదు!

Best Web Hosting Provider In India 2024

కాటన్ బట్టలు ఒక్క ఉతుక్కే రంగు పోతున్నాయా? ఈ చిట్కాలతో ఉతికి చూడండి రంగు పోయే ఛాన్సే లేదు!

Ramya Sri Marka HT Telugu

వేసివిలో మిమ్మల్ని కూల్‌గా, సౌకర్యవంతంగా ఉంచే కాటన్ దుస్తులు ఒక్క ఉతుక్కే రంగు పోతున్నాయా? ఇలా కొత్త బట్టలు ఒక్కసారికే పాతవి అయిపోతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదా? బాధపడకండి ఈ సారి మీ కాటన్ బట్టలను ఉతికేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి. ఇవి కాటన్ డ్రెస్సులను ఎల్లప్పుడూ కొత్తవిగా ఉంచుతాయి.

కాటన్ బట్టలు రంగు పోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి (shutterstock)

వేసవిలో కాటన్ దుస్తులు ఎంత హాయినిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి తేలికగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చల్లగా ఉంచుతాయి. అయితే చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే.. కాటన్ బట్టలు ఒక్క ఉతుక్కే రంగు పోతుంటాయి. కొత్తగా కొన్న కాటన్ కుర్తానో, దుపట్టానో మొదటిసారి ఉతికినప్పుడే దాని రంగంతా నీళ్లలో కలిసిపోతుంది. ఇలా తరచూ జరగడం వల్ల దుస్తులు తొందరగా పాతబడినట్లు కనిపిస్తాయి.

మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? మీ కొత్త కాటన్ దుస్తుల రంగు పోకుండా ఉండటానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ కాటన్ దుస్తులు ఎక్కువ కాలం ఆకర్షణీయంగా, కలర్ ఫుల్‌గా కనిపించడానికి మీకు సహాయపడే కొన్ని సింపుల్ చిట్కాలు మీకోసం ఇక్కడున్నాయి!

కాటన్ బట్టల నుండి రంగు ఎందుకు కారుతుంది?

కాటన్ దుస్తుల రంగు ఎందుకు కారుతుంది అని ఆలోచన చాలా మందిలో కలిగి ఉంటుంది. నిజానికి కాటన్ దారాలు సహజంగా అంత రంగు కలిగి ఉండవు. వాటికి ప్రత్యేకంగా రంగులు వేస్తారు. కొన్నిసార్లు ఈ రంగులు సరిగా పట్టకపోవడం లేదా నాణ్యత లేకపోవడం వల్ల నీటిలో వేసిన వెంటనే కారడం మొదలవుతుంది. అయితే, కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. కొత్త కాటన్ దుస్తులను కొన్న వెంటనే ఒక ప్రత్యేకమైన ద్రావణంలో నానబెట్టడం వల్ల వాటి రంగు చాలా వరకు స్థిరపడుతుంది. ఎక్కువ కాలం రంగు పొకుండా కొత్తవిగా కనిపిస్తాయి.

1. ఉప్పు-పటికలో నానబెట్టండి ఉతకండి:

  • కొత్త కాటన్ సూట్ లేదా దుపట్టా రంగు కారకుండా ఉండాలంటే.. ముందుగా ఒక లీటరు నీటిలో ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా పటిక పొడి వేయండి.
  • తర్వాత ఆ నీటిలో కొత్త కాటన్ బట్టలు, దుపట్టాను 7-8 గంటలు నానబెట్టండి.
  • నానిన తర్వాత బయటికి తీసి జాడించండి.
  • అంతే ఇలా చేయడం వల్ల మీ కాటన్ బట్టలు రంగు పొకుండా ఉంటాయి.

2. డ్రై క్లీన్ చేయించండి

మీరు ఖరీదైన కాటన్ ఫాబ్రిక్ బట్టలు కొనుక్కుని ఉంటే వాటిని ఇంట్లో ఉతికి పాడు చేయకూడదనుకుంటే మొదటిసారి వేసుకున్నప్పుడు డ్రై క్లీన్ చేయించండి. ఏదైనా కాటన్ ఫాబ్రిక్‌ను మొదటిసారి డ్రైక్లీన్ చేయించడం వల్ల దానిపై వేసిన రంగు పక్కాగా అవుతుంది, పదే పదే రంగు కారే సమస్య తగ్గుతుంది.

3. వెనిగర్‌లో ముంచి తీయండి:

  • బకెట్‌లో చల్లటి నీరు తీసుకుని అందులో ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా వెనిగర్ వేసి కలపండి.
  • తర్వాత ఆ నీటిలో మీ కొత్త కాటన్ బట్టను వేసి రెండు మూడు గంటలు వదిలేయండి.
  • తర్వాత శుభ్రమైన నీటితో జాడించారంటే మీ బట్ట రంగు పక్కాగా మారుతుంది. ఉతికినా రంగు పోదు.

వేసవిలో కాటన్ దుస్తులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు:

చల్లదనం, సౌకర్యం:

కాటన్ ఒక సహజసిద్ధమైన, శ్వాసక్రియకు అనుకూలమైన ఫాబ్రిక్. ఇది చర్మానికి గాలి తగిలేలా చేస్తుంది. తద్వారా చెమట త్వరగా ఆవిరైపోతుంది, శరీరం చల్లగా ఉంటుంది.

చెమటను పీల్చుకుంటుంది:

కాటన్ తన బరువు కంటే 27 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలదు. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి, కాటన్ దుస్తులు వేసుకోవడం చాలా మందిచిది. ఇవి చెమటను పీల్చుకుని శరీరాన్ని పొడిగా ఉంచుతాయి.

చర్మానికి స్నేహపూర్వకమైనది:

కాటన్ చాలా మృదువైనది. సున్నితమైన చర్మం కలిగిన వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. దురద, చికాకు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. సింథటిక్ ఫాబ్రిక్‌ల మాదిరిగా కాకుండా, కాటన్ హైపోఅలెర్జెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

మన్నికైనది:

కాటన్ ఫాబ్రిక్ చాలా బలంగా ఉంటుంది. తరచుగా ఉతకడానికి, ధరించడానికి అనువైనది. తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో కూడా ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

పిల్లలకు అనుకూలమైనది:

పిల్లలు వేడికి చికాకుగా ఫీలవుతారు. కాటన్ దుస్తులు వారి శరీరాన్ని చల్లగా ఉంచడానికి, హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి రక్షించడానికి సహాయపడతాయి.

థర్మల్ ఇన్సులేషన్:

కాటన్ దుస్తులు శరీరం, పరిసరాల మధ్య ఒక గాలి పొరను ఏర్పరుస్తాయి.ఇది వేడిని బదిలీ చేయడాన్ని తగ్గించి, చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

వాతావరణ నిరోధకత:

కాటన్ సహజంగా వాతావరణ మార్పులను తట్టుకోగలదు. కొన్ని రకాల కాటన్ దుస్తులు తేమను కూడా నిరోధిస్తాయి.

వివిధ రకాల డిజైన్‌లు:

కాటన్‌ను వివిధ రకాలుగా నేయవచ్చు, రంగులు వేయవచ్చు. అందువల్ల, కాటన్ దుస్తులు అనేక రకాల స్టైల్స్‌లో, డిజైన్‌లలో అందుబాటులో ఉంటాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024