
Best Web Hosting Provider In India 2024
వేసుకున్న దుస్తులు మన అందాన్ని, హుందాతనాన్ని పెంచుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఆఫీసుకు వెళ్లి పని చేసే జీవన విధానంలో ఉన్నారా? అయితే మీ శీతాకాలపు డ్రెస్సింగ్ మరింత ట్రెండీగా, ఫ్యాషనబుల్‌గా మార్చేసుకోండి. ఈ కాలంలో ధరించే దుస్తులు ఇటు చలి నుంచి కాపాడాలి. అటు ట్రెండీగానూ ఉండాలి. అందుకు మీరేం చేయాలంటే..
ట్రెండింగ్ వార్తలు
కుర్తీలు ధరించే వారు:
ఆఫీసులకు చాలా మంది కుర్తీలు, అనార్కలీలు, జీన్సుల్లాంటి వాటినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ స్వెటర్ లాంటివే దొరకుతున్నాయి. స్వెటర్ కుర్తాలు పొడవుగా, వెచ్చగా, సౌకర్యంగా ఉంటాయి. మామూలు కుర్తీలు ధరించే వారు ఈ కాలంలో ఎక్కువగా అనార్కలీల్లాంటి వాటినే ధరించండి. అయితే ఎక్కువగా ఫ్లేర్ ఉండే వాటినే ఎంపిక చేసుకోండి. అందువల్ల చలి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. ఒక వేళ ఆఫీసులో ఏసీ లాంటివి ఉన్నా పెద్దగా ఇబ్బంది పడకుండా పని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కాలంలో స్ట్రైట్ కట్ కుర్తీలు అంత సౌకర్యవంతంగా ఉండవని గుర్తుంచుకోండి.
చీరలు కట్టుకునే వారు :
కొంత మంది కార్యాలయానికి రోజూ చీరల్లోనే వెళుతుంటారు. అలాంటి వారు మందపాటి కాటన్ చీరల్ని ఎన్నుకోండి. వాటికి నప్పే విధంగా మంచి స్టైలిష్ కోట్‌ని వేసుకోండి. ఆ పై నుంచి చీర కొంగు వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే మీరిందులో ఎంతో హుందాగానూ అనిపిస్తారు. స్వెటర్ లాగా వెచ్చగా ఉండే క్రాప్ టాప్ లాంటి బ్లవుజులు కూడా దొరుకుతున్నాయిపుడు. వాటిని కూడా కొన్ని చీరలకు జత చేసేయొచ్చు. ఫ్యాషన్ తో పాటూ సౌకర్యం కూడా.
జీన్సులు వేసుకునే వారు:
జీన్సుల మీదకి చాలా రకాల వింటర్ వేర్ ఆప్షన్‌లు కనిపిస్తుంటాయి. నిటెడ్ టాప్‌లు, ఉలెన్ టీ షర్టులు, స్వెట్ షర్టుల్లాంటివి బోలెడు రకాలు ఉంటాయి. ఈ కాలంలో ఇలాంటివి ఎంచుకోవచ్చు. మోకాళ్ల వరకు పొడవు ఉండే టాప్స్‌ని ఎంచుకోవడం వల్ల అవి మనకు మరింత వెచ్చదనాన్ని అందిస్తాయి. లుక్ చాలా ప్రొఫెషనల్‌గానూ ఉంటుంది. ఇలాంటి వాటికి మంచి షూస్, యాక్ససరీస్‌ని పెయిరప్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
పైన వేసుకునే కోట్‌ల విషయంలో జాగ్రత్త :
ఇటు ఎథ్నిక్ వేర్ అయినా అటు వెస్ట్రన్ వేర్ అయినా.. ఎలాంటి దుస్తులు ధరిస్తున్నా సరే దేని మీదకు ఏది బాగుంటుంది? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్నింటి మీదకు ఒకటే స్వెటర్ వేసుకోవడం అనేది అంత మంచి లుక్‌ని తీసుకు రాదు. నాలుగైదు మోడళ్ల స్వెటర్లు, కోట్లు, ష్రగ్గులను దగ్గర ఉంచుకోవాలి. వాటిలో మన దుస్తులకు ఏది నప్పుతుందో చూసుకుని వేసుకోవాలి. ఈ విషయాన్ని మాత్రం కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. లేదంటే ప్రతి రోజూ ఒకటే దుస్తులు వేసుకున్న భావన చూసేవారికి కలుగుతుంది.