మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష

Best Web Hosting Provider In India 2024

ట్యాబ్‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం 

మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి 
 
 మన రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది
 
రూ.620 కోట్లతో 4 లక్షల 34 వేల 185 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు

పిల్లలకు అవసరమైన బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు
 
ట్యాబ్‌లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి.. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదు
 
ప్ర‌తీ క్లాస్‌ రూమ్‌ను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాం
  
 ట్యాబ్‌ల పంపిణీతో ప్రతీ విద్యార్థికీ రూ.33వేల లబ్ధి

 నాడు-నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి 
 
ప్రతీ తరగతి గదిని డిజిటలైజ్‌ చేస్తున్నాం
  
వైయ‌స్ఆర్ అమ్మ ఒడి విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ వరం

టోఫెల్‌ పరీక్షకు కూడా మన పిల్లలను తీర్చిదిద్దాలి

ఈనాడు ఒక పేపరా? ఈ పేపర్‌ చదవచ్చా?. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా

చింత‌ప‌ల్లి: మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. ఈనాడు ఒక పేపరా? ఈ పేపర్‌ చదవచ్చా?. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచిచేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం అంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌ ధ్వజమెత్తారు. గిట్టని వాళ్లు వైయ‌స్‌ జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం వైయ‌స్ జగన్ ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించారు.

సీఎం వైయస్‌ జగన్ ఏమ‌న్నారంటే..

  • దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తున్నాం. నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతోంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టిన రోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ..మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య జరుపుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. 
  • ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా చిట్టితల్లులు, చిట్టి పిల్లల మధ్య నా అక్కలు, నా చెల్లెమ్మల మధ్య, అవ్వాతాతల మధ్య, సోదరులు, స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాను. మీ అందరి ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
  • ఈ రోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న పిల్లలంతా …వీరే మన భవిష్యత్, వీరంతా మన వెలుగులు. వీరంతా మన తరువాత కూడా మన రాష్ట్ర భవిష్యత్‌ నిలిపే మన వారసులు.
  • వీరి భవిష్యత్‌ గురించి ఆలోచించి, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు పోటీ ప్రపంచంతో గెలవాలి. అందుకోసం ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు పడ్డాయి.
  • అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుంది. 
  • 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చే మంచి కార్యక్రమం ఇది. ఇది ప్రతి చెల్లెమ్మకు మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు మంచి మేనమామగా ట్యాబ్‌లు ఇస్తున్నాం.
  • మన పిల్లల మీద, మన పేద కుటుంబాలపై ఉన్న మమకారంతో తరతరాల పేదరికం సంకేళ్లు తెచ్చేందుకు, భవిష్యత్‌ను మార్చేందుకు తీసుకువస్తున్న అనేక మార్పుల్లో ట్యాబ్‌లు కూడా రాబోయో దశాబ్ధంలో నిలిచిపోతుంది.
  • ప్రభుత్వ బడుల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రోజు ట్యాబ్‌లు పెడుతున్నాం. డిజిటల్‌ విప్లవంలో భాగంగానే  గత ఏడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.15 లక్షల ట్యాబ్‌లను పిల్లలకు, చదువులుకు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేశాం.
  • పిల్లలకు అవసరమైన బైజూస్‌ కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌ సైట్‌లో పని చేసేలా అప్‌లోడ్‌ చేసి ఇస్తున్నాం. ప్రతి పిల్లాడికి పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఈ ట్యాబ్‌లు ఉపయోగపడుతున్నాయి. 
  • ట్యాబ్‌ల విషయంలో పిల్లలందరికీ ఒక్కటే చెబుతున్నాను. ఈ ట్యాబ్‌లు రిపేరీ అయితే మీ హెచ్‌ఎంకు ఇవ్వండి, లేదా గ్రామ సచివాలయాల్లో ఇవ్వండి..వాళ్లు రసీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీకు రిపేరీ చేసి ఇస్తారు. అలా కాకపోతే ఇంకో ట్యాబ్‌ ఇస్తారు.
  • సెక్యూర్‌ మెబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఏం జరుగుతుందంటే..పిల్లాలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూస్తున్నారన్నది ఈ సాప్ట్‌వేర్‌ ద్వారా తెలుస్తుంది. వీటి పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ ట్యాబ్‌లు మంచి చేసే ఒక ఇంధనంగా ఉంటుంది.
  • ఈ ట్యాబ్‌ మార్కెట్‌ విలువ రూ.17,500, దీనికి తోడు బైజూస్‌ కంటెంట్‌ శ్రీమంతులు కొనుగోలు చేసి  డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కంటెంట్‌ను ఉచితంగా ట్యాబ్‌లో డౌన్‌లోడ్‌ చేసి ట్యాబ్‌లు ఇస్తున్నాం.
  • ఈ ట్యాబ్‌ విలువ అక్షరాల రూ.33 వేలు అవుతుంది. ఈ పిల్లలందరిని కూడా ఇంత ఖర్చు చేసి వారి చేతుల్లో ఎందుకు పెడుతున్నామంటే కారణం..నా పిల్లలు దేశంలోనే కాదు..ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలవాలని వాళ్ల మేనమామగా చేస్తున్నాను.
  • మరోవైపు ప్రతి స్కూల్‌లో కూడా 6వ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్‌ రూమ్‌ను కూడా డిజిటలైజేషన్‌ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నాడు–నేడు పూర్తి చేసుకున్న 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఇంటారాక్ట్‌ ప్లాట్‌ ప్లానల్స్‌ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 
  • ఇప్పటికే నాడు–నేడు మొదటి ఫేజ్‌ పూర్తి చేసుకున్న 15వేల స్కూళ్లలో ఇప్పటికే 30,213 క్లాస్‌ రూమ్‌ల్లో ఐఎఫ్‌పీ పెట్టాం.
  • 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు తీసుకువచ్చాం. స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేశాం. ఇందుకోసం రూ.420 కోట్లు ఖర్చు చేశాం. నాడు–నేడు 2వ దఫా పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 31,834 క్లాస్‌ రూములను డిజిటలైజేషన్‌ చేస్తాం. పూర్తిగా 62,097 క్లాస్‌ రూములు జనవరి 30వ తేదీ కల్లా పూర్తి అవుతుంది.
  • ఈ రోజు ఐఎఫ్‌పీలు బిగించడమే కాకుండా అన్నింటిలో కూడా ఎస్‌డీ కార్డులు, ఆండ్రాయిడ్‌ బాక్స్‌లు, ఐఎఫ్‌పీ ప్యానల్‌ ఉన్న చోట బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేయిస్తున్నాం. క్లాస్‌ రూమ్‌ల్లోనే బైజూస్‌ పాఠాలు ఉంటాయి. పిల్లలకు కన్ఫూజన్‌ లేకుండా అవే పాఠాలు చెబుతారు. ట్యాబ్‌లో అదే కంటెంట్‌ ఉంటుంది. ఇది పిల్లలకు పూర్తిగా ఉపయోగపడుతుంది.
  • ఈ ట్యాబ్‌ పాఠాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్‌లో డౌట్లు వస్తే ఎవరు చెబుతారన్న సందేహం ఉంటుంది. అందుకే ఈ సారి పిల్లలకు ఇచ్చే ఐ ప్యాడ్లో ఒక యాప్‌ అప్‌లోడ్‌ చేయించాం. ఇందులో డౌట్‌ క్లియరెన్స్‌ యాప్‌ ఉంటుంది. దీన్ని వాడుకుని పిల్లలకు ఏ డౌట్‌ ఉన్నా కూడా క్లియర్‌ అవుతుంది. ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు. ట్యాబ్లో ఏమున్నాయి. వాటిని ఇంకా సులభతరం చేయాలని ఆలోచన చేస్తూ..మీ పిల్లల గురించి తాపత్రయపడే వాళ్ల మేనమామ ప్రభుత్వం ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడుతున్నా..
  • రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలు నేర్చుకునేలా డూయేలింగ్‌ యాప్‌ అప్‌లోడ్‌ చేయిస్తున్నాం. ఈ ట్యాబ్‌లు నిరంతరం పిల్లలకు తోడుగా ఉండే ట్యూటర్‌గా అండగా నిలబడుతుంది. వారి ప్రయాణంలో అన్ని రకాలుగా పిల్లలకు సహకారం అందుతుంది.
  • పిల్లలందరూ కూడా ఏపీలో బెస్ట్‌గా ఉండాలని కాదు..ప్రపంచంలోనే బెస్ట్‌గా ఉండాలని నేను చూస్తున్నాను. దాని కోసం ప్రా«ధమిక స్థాయి నుంచే అంటే 3వ తరగతి నుంచి పిల్లలను సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫెల్‌ ఈటీఎస్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఈ రోజు టోఫెల్‌ను ఒక పిరియడ్‌గా కేటాయిస్తూ తర్ఫీదు ఇచ్చేలా 3వ తరగతి నుంచి మొదలుపెడుతున్నాం. ఆలోచన చేయమని అడుగుతున్నాను.
  • మరో 15 సంవత్సరాల తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచన చేయండి. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే నష్టపోతాం. టెక్నాలజీ మారుతోంది. 
  • మనం చేస్తున్న ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని చెబుతున్నారు. ఆ రకంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో మన పిల్లలను ప్రిపేర్‌ చేసేందుకు ఒక సబ్జెక్ట్‌ 8వ తరగతి నుంచి ప్రవేశపెడుతున్నాం. మనం ప్రవేశపెట్టే సబ్జెక్ట్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ను వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. పిల్లలకు అనేక కొత్త అంశాలను పరిచయం చేసేలా కార్యాచరణ మొదలవుతుంది. 
  • మన పిల్లలందరికీ కూడా ఇటువంటి సబ్జెక్ట్‌లను పరిచయం చేసేలా, వారిని పోటీ ప్రపంచంలో నిలబెట్టే మంచి సంకల్పంతో ఫ్యూచర్‌ సబ్జెక్ట్‌ను వచ్చే ఏడాది నుంచి తీసుకువస్తున్నాం. దీనికి సంబం«ధించిన ట్యూటర్ల నియామకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
  • విద్యారంగంలో మన పిల్లలను గొప్పగా నిలబెట్టేందుకు మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్‌.  ప్రభుత్వ స్కూళ్లలో చదివే మన పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగాలు వచ్చేలా ఐబీ సిలబస్‌ తోడుగా ఉంటుంది. మన ప్రభుత్వం ఐబీతో ఒప్పందం కుదుర్చుకుంది. 
  • రాబోయే రోజుల్లో ఐబీ, స్టేట్‌ ప్రభుత్వం కలిసి పని చేస్తుంది. మన బడుల్లో పిల్లల ట్యాబ్‌ల గురించి ఆలోచన చేయండి. మన బడులు ఎలా ఉన్నాయి. గతంలో ఎలా ఉండేవి. 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మన బడులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. 
  • నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న కానుక, అమ్మ ఒడి, ఇంగ్లీష్‌ మీడియం, బైలింగ్‌వల్‌ టెక్ట్స్‌బుక్స్, ట్యాబ్‌లు మన పిల్లలకు ఇవ్వడం, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ డిజిటలైజ్‌ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ ఏర్పాటు చేయడం, సీబీఎస్‌ఈ, ఐబీ వరకు మన బడుల్లో జరుగుతున్న ప్రయాణం గమనించండి.
  • పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువు మాత్రమే. క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల భవిష్యత్‌ మారుతుంది. పేదరికం పక్కకు పోతుందని మీ జగన్‌ గట్టిగా నమ్మాడు కాబట్టే వేగంగా అడుగులు వేస్తున్నాడు. పేద పిల్లల చదువుల కోసం దేశంలో ఏ ప్రభుత్వం పెట్టనంతగా మన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంతగా తపన పడుతున్న మనందరి ప్రభుత్వంపై, మంచి చేస్తున్న ప్రభుత్వంపై కొందరు బురద జల్లుతున్నారు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదని మీ జగన్‌ ఆరాటపడుతున్నాడు. దురుద్దేశంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరంతా చూస్తున్నారు.
  • ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు..వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు.
  • పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే ..ఇవ్వకూడదట. ట్యాబ్‌లు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతారట. మన ప్రభుత్వ బడుల్లో చదువుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేదవర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవోవే వీడియోలు చూస్తున్నారట…పిల్లలు చెడిపోతున్నారని ప్రతి రోజు పని గట్టుకొని నా పై విమర్శలు చేస్తున్నారు. 
  • వీళ్ల పత్రికల్లో రాశారు. జగన్‌ బర్త్‌డే బహుమతి..చెడగొడుతుంది మతి, గాడి తప్పుతున్న బైజూస్‌ చదువులు అంటూ వార్తలు రాస్తున్నారు. ట్యాబ్‌లు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. అయినా జగన్‌ వెనక్కి తీసుకోవడం లేదని వార్తలు రాశారు. ఇది పేపరా? పేపర్‌కు పట్టిన పీడ, దీన్ని చదవవచ్చా..ఛా..
  • ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆపత్రికను సమర్ధించే రాజకీయ నాయకులను ఒక్కటే అడుగుతున్నాను. ఇంత దిగజారి రాతలు రాయకండి అని అందరికి చెబుతున్నాను. పేదవర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెబుతున్నాను. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దని చెబుతున్నాను.
  • మీ పిల్లలు, మీ మనవళ్ల చేతుల్లో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉండవచ్చు. కానీ పేద పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు ఉండకూడదా? ఇది సరైన పోకడేనా. మీ పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉంటే చెడిపోతే. ..కానీ పేద పిల్లలు మాత్రం చెడిపోతారా?. మీ పిల్లలేమో ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదవాలి, పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం బడులకు వెళ్లకూడదు, ఇంగ్లీష్‌ చదవకూడదా?. తెలుగు భాష అంతరించిపోతుందటారు, కానీ వాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదువుతారు.ఇటువంటి ప్రపంచంతో, ఇటువంటి రాజకీయాలతో ఈ రోజు మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు.
  • నిన్న ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అంతా కూడా ఒకవైపు జగన్‌కు పది తలకాయలు చూపిస్తారు. రాష్ట్రమంతా అప్పులపాలు అయిందని రాస్తారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ఆరు గ్యారంటీలు చెబితే పాతక శీర్షికలో రాస్తారు. వారి ఇచ్చేవి చూస్తే జగన్‌ ఇచ్చేదానికన్నా వారు చెప్పేది మూడింతలు. ఎంత మోసం చేస్తున్నారో ఆలోచన చేయండి. గతంలో 2014లో వాళ్లే అధికారంలో ఉన్నారు. ఆ రోజు రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. పొదుపు సంఘాల మహిళలను మోసం చేశారు. ఇంటింటికి జాబ్‌ ఇస్తామన్నారు. జాబ్‌ ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇంతదారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 దాకా అందర్ని మోసం చేశారు.
  • చివరికి టీడీపీ మేనిఫెస్టో ను వెబ్‌సైట్‌ నుంచి తీసేశారు. ప్రజలు కొడతారని భయపడి నెట్‌లో లేకుండా చేశారు.
  • ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి 99 శాతం హామీలు నెరవేర్చి మీ ముందుకు వచ్చాను. నేరుగా బటన్‌ నొక్కి రూ.2.40 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాను. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ ఇలా బటన్‌ ఎలా నొక్కగలుగుతున్నాడు. నేరుగా డబ్బులు ఎలా జమ చేశారో గమనించండి. గత పాలకులు ఇలా ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయండి.
  • అప్పుల్లో పెరుగుదలలో కూడా అప్పటి కంటే ఇప్పుడు చాలా తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు ఎందుకు చేయలేదో ఆలోచన చేయండి. కారణం అప్పట్లో ఒక గజదొంగల ముఠా రాష్ట్రంలో పరిపాలన చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు..ఇసుక నుంచి మద్యం దాకా, స్కీల్‌ స్కామ్, ఫైబర్‌ గ్రిడ్, ఏదీ ముట్టుకున్నా కూడా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం..ఆలోచన చేయండి.
  • 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో, చంద్రబాబు హయాంలో ఎందుకు జరుగలేదో ఆలోచన చేయండి, మీ బిడ్డ హయాంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారుతున్నాయి. గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. 1వ తేదీ తెల్లవారుజామునే చిక్కటి చిరునవ్వుతో గుడ్‌మార్నింగ్‌ చెప్పి అవ్వాతాతల చేతుల్లో పింఛన్‌ సొమ్ము పెడుతున్నారు. గతంలో ఎందుకు ఇలా చేయలేకపోయారు. 
  • ఎవరైతే మీకు మంచి చేశారో..ఆ మంచి చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్లలోకి చూసి గట్టిగా చెప్పగలడు. మీఇంట్లో మీకు మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అరడజన్‌ టీవీ చానల్స్, ఒక దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డను నమ్ముకుంది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే. కాబట్టి దయచేసి మోసపోకండి. మీకు మంచి జరిగిందా? లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డకు మంచి జరిగితే కచ్చితంగా అండగా నిలబడండి. 
  • మళ్లీ మోసం చేసేందుకు వీరందరూ బయలుదేరారు. రేపు పొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికి ఒక బెంజీ కారు ఇస్తామంటారు. జగన్‌ ట్యాబ్‌ ఇచ్చారు కానీ మేం బెంజి కారు ఇస్తామంటారు. దయచేసి మోసపోవద్దని మీ అందరికి కోరుకుంటూ..దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను.
  • పాడేరు నియోజకవర్గానికి సీఎం వైయస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే అడిగిన ప్రతి దాన్ని యుద్ధప్రాతిపాదిక మంజూరు చేస్తూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *