Best Web Hosting Provider In India 2024

రొయ్యల పులావ్ రెసిపీ
Prawns Pulao: చికెన్ పులావ్, మటన్ పులావే కాదు రొయ్యలు పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సముద్రపు రొయ్యలు, చెరువు రొయ్యలు… రెండు రకాలు ఉంటాయి. మీకు ఏది నచ్చితే ఆ రొయ్యలతో పులావ్ చేసి చూడండి. ఇది ఒక్కసారి తింటే పదే పదే తినేలా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. రొయ్యలు ఎంత తిన్నా కూడా శరీరంలో కొవ్వుగా మారవు. కాబట్టి చికెన్, మటన్ వంటి వాటితో పోలిస్తే రొయ్యలు ఆరోగ్యకరమైనవని చెప్పుకోవచ్చు. వీటితో పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. రొయ్యలు పులావ్ వండేందుకు సాధారణ బియ్యాన్ని వాడొచ్చు. బాస్మతి బియ్యం వాడితే మాత్రం రుచిగా ఉంటాయి. లేదా సోనామసూరి బియ్యాన్ని వాడండి.
ట్రెండింగ్ వార్తలు
రొయ్యల పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు – పావు కిలో
వండిన అన్నం – రెండు కప్పులు
నెయ్యి – ఒక స్పూను
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూన్
నూనె – సరిపడా
గరం మసాలా – ఒక స్పూను
పసుపు – అర స్పూను
కారం – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
రొయ్యల పులావ్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి. అందులో పసుపు ఒక స్పూన్ వేయాలి.
2. ఇప్పుడు పచ్చి రొయ్యలను అందులో వేసి మీడియం మంట మీద వేయించాలి. రొయ్యల్లోని నీరంతా దిగి, అది ఇంకిపోయేదాకా ఉంచాలి.
3. ఇప్పుడు ఆ రొయ్యలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అదే కళాయిలో మరొక రెండు స్పూన్ల నూనె వేయాలి.
4. ఉల్లిపాయలను నిలువుగా తరిగి అందులో వేసి వేయించాలి. పచ్చిమిర్చిని కూడా నిలువుగా తరిగి వేసి వేయించాలి.
5. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం కూడా వేసి వేయించాలి.
6. ఇప్పుడు మళ్లీ రొయ్యలను అందులో వేయాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా కలుపుకోవాలి.
7. ముందుగానే వండుకున్న అన్నాన్ని ఇందులో కలిపి పులిహోర కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి.
8. పైన కొత్తిమీర, పుదీనాను జల్లుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి.
9. స్టవ్ కట్టేసి ఈ వేడి వేడి రొయ్యలు పులావ్ సర్వ్ చేయాలి. దీని రుచి అదిరిపోతుంది.
రొయ్యలు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పించడంలో ఇవి ముందుంటాయి. అలాగే ఎముకలకు బలాన్ని అందిస్తాయి. రొయ్యలు తరచూ తినేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకునే శక్తి రొయ్యలకు ఉంది. నరాల ఆరోగ్యానికి కూడా రొయ్యలు అవసరం. రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా రొయ్యలు కాపాడతాయి. అధిక బరువుతో బాధపడేవారు రొయ్యలను తినడం వల్ల మేలే జరుగుతుంది. చికెన్, మటన్, గుడ్లు వంటివి తినడం వల్ల ఎంతో కొంత కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది. కానీ రొయ్యలు తింటే కొవ్వు చిటికెడు కూడా శరీరంలో పేరుకుపోదు. అలాగే రొయ్యల పెరుగుదలకు ఎలాంటి పురుగుల మందులు, యాంటీబయోటిక్స్ ను వాడరు. కాబట్టి రొయ్యలు తినడం అన్ని విధాలా మంచిదే.
టాపిక్