Best Web Hosting Provider In India 2024

Salaar Day 3 WW Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమా తుఫాన్ సృష్టిస్తోంది. భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. యాక్షన్ మోడ్‍లో ప్రభాస్‍ను చూసి ప్రేక్షకులు ఉప్పొంగుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న రిలీజ్ అయిన సలార్.. ఆరంభం నుంచే పాజిటివ్ టాక్‍తో భారీ వసూళ్లను దక్కించుకుంటోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎంత కలెక్షన్లను సాధించిందో మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 25) అధికారికంగా వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
సలార్ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.402 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మూడు రోజుల్లోనే రూ.400 మార్కును దాటి సత్తాచాటింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.176 కోట్లు రాబట్టిన సలార్.. రెండో రోజు రూ.119 కోట్లు.. మూడో రోజైన ఆదివారం రూ.107 కోట్ల గ్రాస్‍ను ఖాతాలో వేసుకుంది.
సోమవారం క్రిస్మస్ హాలీడే కావడంతో కలెక్షన్ల జోరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మంగళవారం నుంచి కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది.
జవాన్‍ను దాటేసి..
షారుఖ్ ఖాన్ హీరోగా ఈ ఏడాది వచ్చిన జవాన్ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.384 కోట్ల కలెక్షన్లను సాధించింది. దీన్ని సలార్ దాటేసింది. మూడో రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్ చేరింది. ఈ ఏడాది తొలి వీకెండ్‍లో అత్యధిక కలెక్షన్లను దక్కించుకున్న మూవీగా సలార్ నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి మూడు రోజుల్లోనే సలార్ సినిమా రూ.130కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు ట్రేడ్ నిపుణులు లెక్కలు వేశారు. నైజాంలో బాహుబలి-2కు మించి సలార్ కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఆంధ్ర, సీడెడ్‍లోనూ సలార్ దుమ్మురేపుతోంది. మూడు రోజుల కలెక్షన్ల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఆర్ఆర్ఆర్ తర్వాత రెండో స్థానంలో సలార్ నిలుస్తోంది.
ఇక, నార్త్ ఇండియా (హిందీ)లో ఇప్పటి వరకు సలార్ మూవీ రూ.63 కోట్ల గ్రాస్ (రూ.27కోట్ల షేర్)ను రాబట్టినట్టు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ పోటీలో ఉన్నా.. సలార్ చిత్రమే దూకుడు చూపిస్తోంది. కర్ణాటకలోనూ రూ.25కోట్ల గ్రాస్‍కు దగ్గర్లో సలార్ చేరింది. తమిళనాడు, కేరళలోనూ దూకుడు చూపిస్తోంది. విదేశాల్లో సలార్ ఆధిపత్యం కొనసాగుతోంది.
సలార్ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, బాబీ సింహా కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
టాపిక్