Best Web Hosting Provider In India 2024

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గంగోత్రి చిత్రంతో హీరో అయ్యే ముందు కొన్ని చిత్రాల్లో బాలనటుడిగా చేశారు. విజేత సినిమాతో ఆయన బాలనటుడిగా తెరగేట్రం చేశారు. ఆ తర్వాత స్వాతి ముత్యంలోనూ శివయ్య మనవడి క్యారెక్టర్ చేశారు. చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలోనూ అల్లు అర్జున్ కనిపించారు. అయితే, చిరూ హీరోగా తెరకెక్కిన విజేత సినిమా గురించి తాజాగా గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్.
ట్రెండింగ్ వార్తలు
విజేత సినిమా 100 రోజుల షీల్డుతో ఆ మూవీ నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్ ఉన్న ఫొటోను అల్లు అర్జున్ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. “నా తొలి సినిమా (విజేత).. నా నిర్మాత (నాన్న)” అని రాసుకొచ్చారు. అలాగే, “దేవుడా.. నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం ఆయన నాకు డబ్బు చెల్లించలేదు” అని అల్లు అర్జున్ సరదాగా రాసుకొచ్చారు. స్మైలీ ఎమోజీని కూడా ఉంచారు.
కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా 1985లో విజేత చిత్రం రిలీజ్ అయింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్ అయింది. ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశారు అల్లు అర్జున్. ఆ తర్వాత 2003తో గంగోత్రీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా చాలా బ్లాక్‍బాస్టర్లు కొట్టి.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ చిత్రం షూటింగ్‍లో ఫుల్ బిజీగా ఉన్నారు. 2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్‍బాస్టర్ అయిన పుష్ప 1కు సీక్వెల్‍గా ఇది రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 2024 ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది.
పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2: ది రూల్ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.