Best Web Hosting Provider In India 2024

CM Jagan Adudam Andhra : ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయని సీఎం జగన్ అన్నారు. ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా కాలేజీ గ్రౌండ్ లో లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులతో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. సీఎం జగన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నేటి నుంచి 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా హిస్టరీలో నిలబడిపోతుందన్నారు. రెండు ప్రధానమైన ఉద్దేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఆరోగ్యంపై అవగాహన
“ప్రతి ఊరిలో జరిగే ఈ కార్యక్రమం వ్యాయామం, స్పోర్ట్స్ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై అవగాహన కల్పిస్తుంది. ఆరోగ్యం సరిగా ఉండాలంటే క్రీడలు ఎంత అవసరమని తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్‌గా ఉపయోగపడుతుంది. క్రమంత తప్పకుండా కచ్చితంగా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల బీపీ లాంటివి కంట్రోల్‌లో ఉంచగలుగుతాం. టైప్2 డయాబెటిస్ లాంటివి నిరోధించడంలో క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తాయి. వ్యాయామం ఎంత ముఖ్యమో ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడేలా అడుగులు వేశాం. ఇందులో భాగంగానే వ్యాయామం ఎంతో అవసరం అన్నది కూడా గ్రామస్థాయిలోకి మెసేజ్ తీసుకుని వెళ్లేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టాం” – సీఎం జగన్
చెన్నై సూపర్ కింగ్స్ భాగస్వామ్యంతో
స్పోర్ట్స్ ఆడించే కార్యక్రమం సచివాలయం నుంచి మొదలు పెడితే.. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గ్రామాల్లో ఉన్న క్రీడా ఆణిముత్యాలను వెతకడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న ఆణిముత్యాలను సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి మన పిల్లలను పరిచయం చేస్తామన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పోటీల నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేందుకు క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చిందని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారన్నారు.
గ్రామస్థాయిలో ట్యాలెంట్ హంట్
బ్యాడ్మింటన్‌కు సంబంధించి కిదాంబి శ్రీకాంత్, సింధు ముందుకొచ్చారని సీఎం జగన్ తెలిపారు. వీళ్లకు విశాఖ, తిరుపతిలో ల్యాండ్, ఇచ్చామన్నారు. బ్యాడ్మింటన్ అకాడమీస్ స్థాపించేందుకు వీరికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. వీళ్లు కూడా మెంటార్లుగా మన పిల్లల ట్యాలెంట్‌ను గుర్తించడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్లంతా కలిసి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఆరోగ్యంపై అవేర్‌నెస్, మరో రకంగా ట్యాలెంట్ హంట్ కూడా జరుగుతోందన్నారు.
9 వేల గ్రౌండ్లు సిద్ధం
“ఈ ఆటల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.15 వేల సచివాలయాల పరిధిలో ఇప్పటికే 9 వేల ప్లే గ్రౌండ్లు గుర్తించాం. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను గుర్తించాం. స్కూళ్ల దాకా కిట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకోస్తాం” – సీఎం జగన్