Best Web Hosting Provider In India 2024
Minister Ponguleti: ఎన్నికల్లో గెలిపించినందుకు తామే ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని.. మంత్రులను కలవడానికి వచ్చేటప్పుడు శాలువాలు, బొకేలు తీసుకొస్తేనే సంతోషపడతామని అనుకోవద్దని.. పలకరించి గ్రీట్ చేస్తే అంతే చాలని మంత్రి పొంగులేటి అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
శాలువా, పూల బొకే కొంటే రూ.1000 ఖర్చవుతుందని, అనవసర ఖర్చు చేయకుండా.. ఆ డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇవ్వాలని సూచించారు. మున్ముందు చాలా పనులు చేసుకోవాల్సి ఉందని.. అవన్నీ జరగాలంటే ఖాళీ అయిన ఖజానాని అందరం కలిసి నింపుకోవాలన్నారు.
ఖజానా నింపే ప్రయత్నం తాము చేస్తున్నామని.. మీరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆ పార్టీ నేతలు ఖాజానాను పూర్తిగా ఖాళీ చేసి ఉత్త తాళం చేతులే మాకు అప్పగించారని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ప్రచారంలోకి తెచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా అనవసర ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు మంత్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వెచ్చించిన ఖర్చును ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్ కి లేక ఇతర కార్యక్రమాలకు డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
మేడిగడ్డ బ్యారేజీలో గుండెలు పగిలే నిజాలు..
ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రాజెక్టు అంటూ బీఆర్ఎస్ నేతలు గొప్పలు పలికిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో గుండెలు పగిలే నిజాలు బయటపడ్డాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఖమ్మంలో మీడియా చిట్ చాట్ లో ఆయన పాల్గొని పలు అంశాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.
ఇటీవల మా మంత్రుల బృందం జరిపిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో ఆ ప్రాజెక్టు లోపాలు తేటతెల్లం అయ్యాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకున్న కాళేశ్వరం లోపభూయిష్టంగా నిర్మితమైనదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఇసుకలో నిర్మించడం బీఆర్ఎస్ సర్కారు డొల్లతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రతి పనిలోనూ ఇదే లోపభూయిష్టతను ప్రదర్శించిన కేసిఆర్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం మా చేతికి వచ్చే నాటికి ముందు మెరుపులు, వెనుక అప్పుల కుంపటి అన్నట్లుగా తెలంగాణ పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వాడిన క్యాంపు కార్యాలయం కేసీఆర్ విలాసాలకు పనికి రాలేదని, అందుకే ఆయన ప్రజల సొమ్ముతో విలాసవంతమైన ప్యాలెస్ లాంటి ప్రగతి భవన్ ను నిర్మించారని విమర్శించారు.
బంగారంలా ఉన్న కలెక్టరేట్ భవనాలను పక్కన పెట్టి కొత్త కలెక్టరేట్ లని నిర్మించి ప్రజా ధనాన్ని వృధా చేశారని తెలిపారు. అయినా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కోరికలకు అనుగుణంగా కాంగ్రెస్ సర్కారు పని చేస్తుందని, ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నా ఏ ఒక్క హామీని విస్మరించబోమని పొంగులేటి స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం)