Best Web Hosting Provider In India 2024
CM Jagan : టీడీపీ ప్రభుత్వం హయాంలో పింఛన్ రావాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, జన్మభూమి కమిటీలే అర్హులను నిర్ణయించేవాని సీఎం జగన్ విమర్శించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారని దుయ్యబట్టారు. తప్పుచేస్తే ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదని ఆరోపించారు. కానీ ఇవాళ పేదలకు ఇస్తున్న ఇళ్లపై అవినీతి అంటూ కేంద్రానికి లేఖ రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాలు ఆపాలని పవన్ కల్యాణ్ ఆలోచన అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినందుకు కోర్టులు జైలుకు పంపాయన్నారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా భాగం ఉందన్నారు. ఈ అవినీతిపరులు… అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు కూడా భాగస్వామి కాబట్టే ప్రశ్నించడంలేదన్నారు.
ట్రెండింగ్ వార్తలు
పొత్తుల పేరుతో కుటుంబాలను చీల్చి రాజకీయాలు
ఎన్నికల వేళ టీడీపీ, జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ ఆరోపించారు. పొత్తులు పేరుతో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తున్నామన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్కొక్కరికీ రూ.58 వేలు పింఛన్ మాత్రమే ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.లక్షా 47 వేలు అందిస్తున్నామన్నారు. గత ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌లు ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను పెంచుకుంటూ రూ.3 వేలు చేశామన్నారు. పింఛన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్లు ఇచ్చేవారని, ఇప్పుడు రూ.2 వేల కోట్లు ఇస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్‌లు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్‌లు అందిస్తున్నామన్నారు.
చంద్రబాబు అవినీతిలో పవన్ పాట్నర్
2014లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నో హామీలు ఇచ్చారని సీఎం జగన్ అన్నారు. వాటిల్లో ఒక్క హామీ కూడా అమలుచేయలేదని విమర్శించారు. పేదలకు 3 సెంట్ల భూమి ఇస్తామని ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలులో ఉంటే దత్తపుత్రుడు పవన్ పరామర్శించారన్నారు. చంద్రబాబు అవినీతిపై పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా భాగస్వామేనని దుయ్యబట్టారు.