Best Web Hosting Provider In India 2024
Nalgonda Municipality : రాష్ట్రంలో అధికారం మారడం, జిల్లాల రాజకీయ ముఖచిత్రాల్లో మార్పులకు కారణం అవుతోంది. గత ఏడాది తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టగా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెరపడింది. బీఆర్ఎస్ 2018లో రెండో సారి అధికారం చేపట్టాక జరగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధించింది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో మెజారిటీ బీఆర్ఎస్ వశం అయ్యాయి. కొన్ని చోట్ల అధికారంలోకి రాగలిగిన స్థాయిలో బలం తెచ్చుకున్నా, కాంగ్రెస్ స్థానిక పీఠాలకు దూరం కావాల్సి వచ్చింది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో బీఆర్ఎస్ గట్టెక్కింది. ఇపుడు పరిస్థితి మారింది. బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయి, పాలన కాంగ్రెస్ చేతికి వచ్చింది. దీంతో కాంగ్రెస్ స్థానిక నాయకత్వాలు మున్సిపాలిటీల్లో అధికారం కోసం ఎత్తులు వేస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
అవిశ్వాసాల అస్త్రం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది నల్గొండ జిల్లా కేంద్ర మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మున్సిపాలిటీల్లో నల్గొండ, నేరెడుచర్ల, నందికొండ, హాలియా, చండూరు, కోదాడ, భువనగిరి, మోత్కూరు, ఆలేరు మున్సిపాలిటీల చైర్మన్లను దించేసి తమ పార్టీని మున్సిపల్ పీఠం ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస నోటీలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ మంచి మెజారిటీతో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నా.. ఆ తర్వాత వారిపై ఒత్తిళ్లు పెట్టడం ద్వారా చైర్మన్లు, పాలకవర్గంలోని అత్యధిక మంది కౌన్సిలర్లు పార్టీ మారి గులాబీ కండువాలు కప్పుకునేలా చేయగలిగారు. ఇలాంటి మున్సిపాలిటీల్లో ఇదే వ్యూహాన్ని ఇపుడు కాంగ్రెస్ అమలు చేయాలని చూస్తోంది.
ముందే పార్టీ మారిన బీఆర్ఎస్ చైర్మన్లు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయిదు మున్సిపాలిటీల చైర్మన్లు ముందుగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిపోవడంతో వీరు అవిశ్వాస తీర్మానాల నుంచి బయటపడ్డారు. దేవరకొండ, చిట్యాల, హుజూర్ నగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఈ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయి. ఈ మున్సిపాలిటీల్లో ఎలాంటి పదవుల మార్పిడికి అవకాశం లేకుండా పోయింది. వీరంతా మొన్నటి శాసన సభ ఎన్నికలకు ముందే పార్టీ మారి, కాంగ్రెస్ అభ్యర్థుల కోసం పనిచేశారు. వారంతా ఎన్నికల్లో విజయం సాధించడంతో మున్సిపల్ చైర్మన్లు తమ పదవులు కాపాడుకున్నట్లు అయ్యింది.
హాట్ టాపిక్ గా నల్గొండ మున్సిపాలిటీ
ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రమైన నల్గొండ మున్సిపాలిటీ వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. 48 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఇపుడు బీఆర్ఎస్ లో కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమ ఉజ్జీలుగా కౌన్సిలర్లను గెలుచుకున్నా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని ఎక్కకుండా అడ్డుకుని బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డిని చైర్మన్ చేశారు. కానీ, ఎన్నికల ముందే బీఆర్ఎస్ కు చెందిన వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ సహా, పది మంది కౌన్సిలర్లు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఆ తర్వాత కూడా మరికొందరు పార్టీ మారారు. ఇదే అదునుగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న బుర్రి శ్రీనివాస్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ అవిశ్వాస నోటీసు ఇవ్వడంతో ఈ నెల 8వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు చైర్మన్ సైదిరెడ్డి హైకోర్టు గడప తొక్కారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి విప్ జారీ చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాగా, 8వ తేదీ సమావేశం తర్వాత.. ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ నుంచి చైర్మన్ ఎన్నిక ఉంటుందన్న భరోసాలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అవిశాస రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )
సంబంధిత కథనం