Nalgonda Politics: నల్గొండ జిల్లాను మరో మంత్రి పదవి వరిస్తుందా..?

Best Web Hosting Provider In India 2024

Nalgonda Politics: నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు అమాత్య పదవుల్లో ఉండగా.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడికి పదవి ఎలా కట్టబెడతారు..? అసలు మంత్రి పదవి ఇస్తానంటేనే పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల నెరవేరుతుందా..? ఇపుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రశ్నలివి..?

ట్రెండింగ్ వార్తలు

జోరుగా కోమటిరెడ్డి ప్రయత్నాలు…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు నుంచే కేబినెట్ లో బెర్త్ కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందు ఏఐసీసీ నాయకత్వం మంత్రి పదవి ఇస్తామన్న హామీ వల్లే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారన్న ప్రచారం కూడా ఉంది.

కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా విజయాలు సాధించిన రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక సీఎల్పీ పదవి కోసం కూడా ప్రయత్నించారు. ఆ పదవి దక్కకపోవడంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీ కాలం ముగిశాక, కొత్త పీసీసీ సారథి కోసం కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆలోచనలు మొదలు పెట్టడంతోనే రాజగోపాల్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం కూడా ప్రయత్నించి విఫలమయ్యారు.

ఆ తర్వాత నుంచి పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఉన్న ఆయన చివరకు కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగి మునుగోడులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలంగాణ కాంగ్రెస్ కు కొంత ఊపు తెచ్చిపెట్టింది.

దీంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం అందిరిలో కలిగింది. ఈ సమయంలోనే ఏఐసీసీ నాయకత్వం రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్ల దాఖలు సమయంలో పార్టీలో చేరి, మునుగోడు టికెట్ తెచ్చుకున్న రాజగోపాల్ రెడ్డికి ముందే మంత్రి పదవి హామీ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ కారణంగానే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆయన భావించినా, తొలి విడతలో ఆయనకు అవకాశం దక్కలేదు. మరో వైపు రాష్ట్ర కేబినెట్లో మరికొన్ని బెర్తులు ఖాళీగా ఉండడంతో మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అడ్డంకిగా సామాజిక సమీకరణాలు

రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాల మాటెలా ఉన్నా.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. వీరిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక పోతే ఒకే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమేనా..? అదీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఎలా ఇస్తారు అన్న సందేహాలతో పాటు.. ఒకే కుటుంబానికి చెందిన సోదరులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అన్నదమ్ములిద్దరికీ పదవులు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉమ్మడి ఏపీలో వైఎస్ కేబినెట్ లో ఖమ్మం జిల్లాకు చందిన రాంరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల, నల్గొండ జిల్లాకు చెందిన ఆయన సోదరుడు సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉండిన రాంరెడ్డి దామోదర్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు లభించని అంశాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో సైతం ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారయణరెడ్డి సోదరుల్లో వివేకానందరెడ్డికి అవకాశం దక్కని అంశాన్ని వీరు ఉదహరిస్తున్నారు. తక్కువ మంత్రి పదవులు ఉండడం, ఆశావాహులు ఎక్కువగా ఉండడం, ఇప్పటి దాకా మంత్రివర్గంలో చోటు దక్కని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తోందన్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఏ లెక్కన మంత్రి పదవి దక్కుతుందన్న అంశం చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదు. అదే మాదిరిగా, ముస్లిం మైనారిటీల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఈ కారణంగానే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి, ఈ ఖాళీని భర్తీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

మరో వైపు జిల్లాకు చెందిన నాయకుడు అద్దంకి దయాకర్ మొన్నటి ఎన్నికల సమంయలో పార్టీ సూచన మేరకు తుంగతుర్తి టికెట్ ను త్యాగం చేశారని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను మండలిలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈ అంశాలన్నింటినీ విశ్లేషిస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందా..? లేదా..? అన్న విషయం ఉత్కంఠరేపుతోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024