Khammam Projects: ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్ట్ “సీతారామ”.. తుమ్మల రాకతో పనుల్లో కదలిక

Best Web Hosting Provider In India 2024

Khammam Projects: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలకే పరిమితమైన సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ హయంలో కార్యరూపం దాల్చింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఓటమితో గడిచిన ఐదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్న తుమ్మల సీతారామ పనులను వేగవంతం చేశారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే తన జీవితం సాఫల్యం అవుతుందన్న తుమ్మల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

దశాబ్దాల సాగునీటి కలకు ఊపిరి..

పక్కనే గోదారి జలజలా పారుతున్నా బీడు బారిన భూములు.. సాగు నీటి కోసం దశాబ్దాలుగా రైతన్నలు ఎదురు చూస్తున్నా సాకారం కాని కర్షకుల కల.. కళ్లెదుటే పంటలు ఎండిపోయి కరువు రక్కసి కోరల్లో రైతులు ఉరికొయ్యకు వేలాడే దుస్థితి.. ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతన్నల పరిస్థితి.. ఈ స్థితిని మార్చివేసి దశాబ్ధాల సాగు నీటి కలను సాకారం చేయడానికి నాడు మంత్రి గా సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు తుమ్మల నాగేశ్వరరావు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్ ప్రతిపాదనలకే పరిమితమైంది.

శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేసే లక్ష్యంతో టీడీపీ హయంలో తుమ్మల.. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు. కానీ నిధుల సమస్యతో ఉమ్మడి రాష్ట్రంలో ఆ కల సాకారం కాలేదు. అనంతరం కేసీఆర్ కేబినెట్ లో తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామకు పునాది పడింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం జరిగి 2104 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెందినప్పటికీ కేసీఆర్ ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్దిని కాంక్షిస్తూ తుమ్మలకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా భూముల్లో పచ్చని పంటలు పండాలంటే సాగు నీటి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని భావించిన తుమ్మల గోదావరి జలాలను లిఫ్ట్ చేసేలా తనకున్న అనుభవంతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గోదావరి జలాలను పారించాలన్న తలంపుతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాగు నీటి ప్రాజెక్ట్ లతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్ తుమ్మల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రాజెక్ట్ పేరును శ్రీ రాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో “సీతారామ” ప్రాజెక్ట్ గా నాడు కేసీఆర్ నామకరణం చేశారు.

శంకుస్థాపన చేసింది కేసీఆరే..

సీతారామ ప్రాజెక్ట్ కు 2016 ఫిబ్రవరి 16న నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్ధ్యంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుండగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరిగి ఏడు సంవత్సరాలు అవుతున్నా ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలేదు.

గతంలో మంత్రిగా తుమ్మల ఉన్న సమయంలో వారానికి ఓసారి ప్రాజెక్ట్ పనులను మానిటరింగ్ చేసేవారు. కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమితో సీతారామ ప్రాజెక్ట్ పనులకు గ్రహణం పట్టింది.

మళ్లీ పనుల వేగవంతం..

రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి గా తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ఐదేళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక శ్రద్ద నిలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల ఉన్నారు.

యుద్దప్రాతిపదికన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం అధికారులతో ఇటీవలే రివ్యూ చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి రివ్యూ మీటింగ్ లో నిధుల సమస్యతో పాటు భూ సేకరణ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, లింక్ కెనాల్స్, రైల్వే రోడ్ క్రాసింగ్ అంశాలపై సమీక్ష చేసి

పాలేరు లింక్ కెనాల్ పై అధికారులకు తుమ్మల దిశా నిర్దేశం చేశారు. సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు పారేలా పాలేరు లింక్ కెనాల్ ను పూర్తి చేస్తే జిల్లా అంతటా సాగు నీటి కష్టాలు తీరి దశాబ్ధాల సాగు నీటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తుమ్మల భావిస్తున్నారు.

ఏన్కూరు రెగ్యులేటర్ వరకు కాల్వలు పూర్తి చేస్తే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి, బోనకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వైరా, మధిర నియోజకవర్గాలకు గోదావరి జలాలు పారేలా తుమ్మల అధికారులకు సూచనలు చేశారు. పాలేరు లింక్ కెనాల్ పూర్తి చేసి పాలేరు వరకు గోదావరి జలాలను తరలిస్తే పాలేరు రిజర్వాయర్ నుంచి వైరా రిజర్వాయర్ అక్కడి నుంచి సాగర్ ఎడమ కాల్వల ద్వారా గోదావరి జలాలు పొలాలకు అందుతాయి.

సహజంగా గోదావరికి జూన్, జులై నెలలో వరదలు వచ్చిన సందర్బంలో గోదావరి జలాలను లిఫ్ట్ చేసి పాలేరు వైరా రిజర్వాయర్ లను నింపొచ్చు. అప్పుడు వానాకాలం పంటలకు ఏ ఇబ్బంది ఉండదు. నాగార్జున సాగర్ ఆగస్ట్ తరువాతే నిండుతుంది. దాంతో వానాకాలం గోదావరి నీళ్లతో రబీ పంటలు పండించే అవకాశం ఉంది.

గోదావరి, కృష్ణా రెండు నదులు, రెండు బేసిన్ల మధ్య రెండు పంటలు పండితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుంది. తుమ్మల పట్టుదల ఫలించి ఈ ఐదేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా సశ్యశ్యామలం అవుతుంది.

(రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం.)

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024