Best Web Hosting Provider In India 2024

Thandel Glimpse: యువ సామ్రాట్, స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్న తండేల్ చిత్రంపై ఆసక్తి విపరీతంగా ఉంది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ‘కార్తికేయ 2’తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్‍కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. గతనెలలోనే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కాగా, ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్‌ను నేడు (జనవరి 5) రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల మూవీ యూనిట్ వెల్లడించింది. అయితే, గ్లింప్స్ వాయిదా వేస్తున్నట్టు నేడు అప్‍డేట్ ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
మూవీ యూనిట్ ముందుగా ప్రకటించిన ప్రకారం.. తండేల్ గ్లింప్స్ నేటి (జనవరి 5) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కావాల్సింది. అయితే, కాస్త ఆలస్యమవుతుందంటూ అప్‍డేట్ ఇచ్చింది. సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ తీసుకొస్తామని చెప్పింది. దీంతో నాగచైతన్య అభిమానులు వేచిచూశారు. అయితే, సాయంత్రం కూడా గ్లింప్స్ రిలీజ్ చేయలేదు మూవీ యూనిట్. కాసేపటి తర్వాత, గ్లింప్స్‌ను రేపటికి (జనవరి 6) వాయిదా వేస్తున్నట్టు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది.
“ఊహించని సాంకేతిక కారణాల వల్ల ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ నేడు విడుదల కాదు. ఈ అద్భుతమైన గ్లింప్స్ రేపు (జనవరి 6) వస్తుంది” అని గీతాఆర్ట్స్ ట్వీట్ చేసింది. దీంతో గ్లింప్స్ కోసం ఎంతగానో ఎదురుచూసిన నాగచైతన్య ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.
ఫ్యాన్స్ నిరాశ
గ్లింప్స్ రెడీ కాకపోతే ముందుగానే వాయిదా ప్రకటించాలని, రెండుసార్లు గంటల పాటు ఎదురుచూయించి నిరాశ పరుస్తారా అని తండేల్ యూనిట్‍పై కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూవీ టీమ్‍లు ఇలా చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. వెయిట్ చేయించి.. సింపుల్‌గా టెక్నికల్ సమస్య అని చెబుతారా అని మరికొందరు అసహనం చెందారు. రేపైనా టైమ్ చెప్పి.. కచ్చితంగా రిలీజ్ చేయండని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
తండేల్ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ మొదలైందని ఇటీవలే అప్‍డేట్ ఇచ్చింది గీతా ఆర్ట్స్ బ్యానర్. సముద్రం మధ్య ఉత్కంఠభరితంగా చిత్రీకరణ జరుగుతోందని వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ ఉడిపిలో జరుగుతుందని సమాచారం. తండేల్ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఇదీ స్టోరీలైన్..
తండేల్ సినిమా యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్య్సకారులు 2018 నవంబర్‌లో గుజరాత్‍లో సముద్రంలో చేపల పేటకు వెళ్లగా.. వారిని పాకిస్థాన్ దళాలు చెరబట్టాయి. ఆ మత్స్యకారులను జైలులో బంధించింది పాకిస్థాన్. ఆ తర్వాత వారిని విడిపించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. చివరికి 2020 జనవరిలో ఆ మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. దీంతో వారు స్వస్థలాలకు చేరారు. ఈ యథార్థ కథ ఆధారంగానే తండేల్ తెరకెక్కుతోంది.