Lok Sabha Elections : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫీవర్, గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు!

Best Web Hosting Provider In India 2024

Lok Sabha Elections : రాజకీయ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై పార్టీలు నజర్ పెట్టాయి. నెల రోజుల కిందటే ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అనూహ్య ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్న బీజేపీ రెండూ తెలంగాణలోకి 17 పార్లమెంటు స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 3 చోట్ల, బీజేపీ 4 చోట్ల, 9 చోట్ల బీఆర్ఎస్, 1 స్థానంలో ఎంఐఎం విజయం సాధించాయి. కాగా, కేంద్రంలో మూడోసారి కూడా అధికారంపై కన్నేసిన బీజేపీ, పదేళ్ల కిందట అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఎత్తులు వేస్తున్నాయి. తెలంగాణలో ఇంకా శాసనసభ ఎన్నికల వేడి తగ్గక ముందే వస్తున్న లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, బీజీపీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా తమ తమ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అండగా ఉండాలన్న దీక్షతో ఉన్నాయి. దీనిలో భాగంగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమించాయి.

ట్రెండింగ్ వార్తలు

పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను నియమించిన బీజేపీ, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పజెప్పింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ కు ఇన్ఛార్జ్ బాధ్యతల అప్పజెప్పింది. గతంలో ఆ పార్టీ సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో విజయం సాధించగా, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పార్టీకి కొంత ఊపు వచ్చినా అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలను గెలుచుకోలేక పోయినా, గతం కంటే ఓట్ల శాతం మెరుగవడంతో పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలపై గురిపెట్టింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు స్థానాలకు బీజేపీ నుంచి ఇన్ఛార్జులుగా నియమితులైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – పాయక్ శంకర్ , పెద్దపల్లి – రమారావు పాటిల్, కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా , నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మెదక్ – పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్‌గిరి – పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ – కే.లక్ష్మణ్, హైదరాబాద్ – రాజసింగ్, చేవెళ్ళ – ఏవీఎన్ రెడ్డి, మహబూబ్‌నగర్ – రామచంద్రరావు, నాగర్‌కర్నూల్ – మాగం రంగారెడ్డి, నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ – మర్రి శశిధరరెడ్డి, మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు, ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి.

పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించిన ఏఐసీసీ

నెల రోజుల కిందటే తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ మంచి ఊపు మీదుంది. అంతకు కొద్ది నెలల ముందే కర్ణాటకలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నల్గొండ, భువనగిరి, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అప్పుడు ఎంపీలుగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రులుగా ఇప్పుడు బాధ్యతల్లో ఉన్నారు. కాగా తెలంగాణలో 17 స్థానాలకు కోఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలకు ఏఐసీసీ నాయకత్వం బాధ్యతలు అప్పజెప్పింది. ఆదిలాబాద్ (ఎస్టీ) – డి. అనసూయ (సీతక్క) , పెద్దపల్లి (ఎస్సీ) – డి. శ్రీధర్ బాబు, కరీంనగర్ – -పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ – టి.జీవన్ రెడ్డి, జహీరాబాద్ – పి.సుదర్శన్ రెడ్డి, మెదక్ – దామోదర రాజనరసింహ, మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ – భట్టి విక్రమార్క మల్లు, హైదరాబాద్ – భట్టి విక్రమార్క మల్లు, చేవెళ్ల – ఎ. రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ – ఎ. రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ (ఎస్సీ) – జూపల్లి కృష్ణారావు, నల్గొండ – ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ (ఎస్సీ) – కొండా సురేఖ, మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను ఏఐసీసీ పార్లమెంటు కో ఆర్డినేటర్లుగా నియమించింది.

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ సైతం సిద్ధమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేరిన పొరపాట్ల సరిదిద్దుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించాలని ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో గులాబీ జెండా ప్రాతినిథ్యం ఉండాలని కేటీఆర్ అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024