Best Web Hosting Provider In India 2024
Ysrcp Complaint To EC : ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. విజయవాడలో ఈసీ బృందం పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసీ బృందాన్ని కలిశారు. ఎన్నికల విధులకు సచివాలయ ఉద్యోగులను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కోరారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా ఈసీ బృందాన్ని కలిసి టీడీపీ, జనసేన పార్టీలపై ఫిర్యాదు చేశారు. గుర్తింపులేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి గుర్తింపు లేదని, అలాంటి పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో కామన్ సింబల్ ఎలా కేటాయిస్తారని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ట్రెండింగ్ వార్తలు
రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు
సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. జనసేనకి గుర్తింపు లేకున్నా ఎందుకు సమావేశానికి ఆహ్వానించారని అడిగామన్నారు. గ్లాస్ సింబల్ సాధారణ గుర్తు అని, సాధారణ గుర్తు కలిగిన జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధమన్నారు. నారా లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో అధికారులపై చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఏపీ, తెలంగాణలో ఒకేసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలన్నారు.
తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు
టీడీపీ, జనసేన ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. బోగస్ ఓట్లు లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారన్నారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి పది లక్షల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని సీఈవోకి ఫిర్యాదు చేశారని, ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓలు చెప్పాలి కానీ ఒక వ్యక్తి ఎలా చెబుతారన్నారు. అసలు ఆ ఫిర్యాదు బోగస్ అన్నారు. తెలంగాణలో ఓట్లు కలిగిన వాళ్లకు ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయని, ఇలాంటి డ్లూప్లికేట్ ఓట్లు తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. దీంతో దొంగ ఓటర్లను నియంత్రించవచ్చన్నారు. తెలంగాణ ఓటర్ లిస్టులో పేరు డిలీట్ చేశాకే ఏపీలో ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈసీని కోరామన్నారు. చంద్రబాబు, లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.