Mahesh Babu Guntur Kaaram: ‘ఇక నుంచి మీరే నాకు అమ్మ.. నాన్న.. అన్నీ’: ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

Best Web Hosting Provider In India 2024

Mahesh Babu at Guntur Kaaram Pre Release: గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (డిసెంబర్ 9) భారీస్థాయిలో జరిగింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుండగా.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను నేడు గుంటూరులో నిర్వహించింది మూవీ యూనిట్. ఈ ఈవెంట్‍కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. ఈలలు, కేరింతలతో మోతెక్కించారు. కోలాహలం మధ్య ఈ ఈవెంట్ జరిగింది. గుంటూరు కారం ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో హీరో మహేశ్ బాబు ఎమోషనల్‍గా మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

తన తండ్రి, దిగ్గజ హీరో దివంగత సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకొని మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి మన మధ్యలో లేకపోవడం చాలా కొత్తగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి అభిమానులే తనకు అమ్మ, నాన్న, అన్నీ అని మహేశ్ బాబు అన్నారు.

“ఇందాక AV చూసినప్పుడు నాకు ఇది 25వ సంవత్సరం (యాక్టింగ్ కెరీర్) అని తెలిసింది. పాతిక సంవత్సరాలు.. మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతీ సంవత్సరం పెరుగతానే ఉంది అది. మాటలు లేవు.. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎప్పుడూ చెబుతుంటాను కదా.. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ తెలియదని. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు” అని మహేశ్ బాబు అన్నారు. అభిమానులకు చేతులెత్తి నమస్కారం చేశారు.

“సంక్రాంతి నాకు గానీ, మా నాన్నకు గానీ ఎప్పుడూ బాగా కలిసి వచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతి రిలీజ్ అయితే అది బ్లాక్‍బాస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. బాగా గట్టిగా. అయితే ఈసారి కొంచెం నాకు కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్న గారు మన మధ్యలో లేరు. అందువల్లేనేమో. ఆయన నా సినిమాలను చూసి రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి చెబుతుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. దాని కోసమేగా ఇవన్నీ.. ఈ సినిమాలన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ.. మీరే నాకు నాన్న.. మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు.. అభిమానం ఎప్పుడూ నాదగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్యూ” అని మహేశ్ బాబు భావోద్వేగపూరితంగా మాట్లాడారు. మహేశ్ మాటలకు అభిమానులు ఉప్పొంగిపోయారు. హర్షధ్వానాలతో హోరెత్తించారు.

థమన్ నాకు తమ్ముడిలాంటోడు

కుర్చీ మడత పెట్టి పాటకు థియేటర్లు బద్దలవుతాయని మహేశ్ బాబు అన్నారు. ఈ పాట చేయాలని తాను, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పగానే థమన్ అభ్యంతరం చెప్పకుండా చేశారని మహేశ్ అన్నారు. వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే పదిసార్లు చర్చలు పెట్టేవారని మహేశ్ బాబు చెప్పారు. థమన్ తనకు తమ్ముడిలాంటి వాడని అన్నారు.

గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేయగా.. రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీరోల్స్ చేశారు. జనవరి 12న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024