Hanuman Director Prashanth Varma: ఆదిపురుష్‌లాగా మేము దేవుళ్లను తప్పుగా చూపించం: ప్రశాంత్ వర్మ

Best Web Hosting Provider In India 2024

Hanuman Director Prashanth Varma: హనుమాన్ మూవీతో మరో లెవల్ కు వెళ్లిపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది వచ్చిన ఆదిపురుష్ మూవీని ఎంతో మంది ట్రోల్ చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా దీనిపై స్పందించాడు.

 

ట్రెండింగ్ వార్తలు

హనుమాన్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్.. డీఎన్ఏ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ సినిమా ఎలా తీయాలో, ఎలా తీయకూడదో తాను ఇతర సినిమాలు చూసే తెలుసుకుంటానని అతడు అన్నాడు. తెలుగు సినిమా ఎప్పుడూ భారత ఇతిహాసం, హిందూ ధర్మాన్ని కించపరిచేలా సినిమాలు చేయలేదని అతడు చెప్పాడు.

ఎలా తీయకూడదో ఆ సినిమాలు చూసే తెలుసుకున్నా

డీఎన్ఏ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. “రామాయణం, మహాభారతాలను చెప్పే ఎన్నో స్టోరీలను తెలుగు సినిమా అందించింది. ఎన్టీఆర్ సర్ అలాంటి ఎన్నో సినిమాలు తీశారు. ఎప్పుడూ సమస్య రాలేదు. ప్రతిసారీ ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించారు. మా వరకూ ఎన్టీఆర్ సర్ కృష్ణుడు. ఇళ్లలో దేవుళ్ల ఫొటోల బదులు ఆయన ఫొటోలు ఉంటాయి. దేవుళ్ల గురించి ఎప్పుడూ ఓ ఇండస్ట్రీగా మేము తప్పుగా చూపించలేదు” అని ప్రశాంత్ అనడం గమనార్హం.

“నేను ఈ జానర్ లో వచ్చిన అన్ని సినిమాలు చూస్తాను. దాని వల్ల ఓ సినిమాను ఎలా తీయాలి? ఎలా తీయకూడదు అన్నది తెలుసుకుంటాను. భిన్నమైన ఫలితాలను పొందడానికి ప్రతిదీ భిన్నంగా చేయాల్సి ఉంటుంది. బహుశా ఇది మేము పెరిగిన వాతావరణం, ఆ కథలు వింటూ పెరిగిన విధానం వల్ల కావచ్చు. ఇలాంటివి మా మనసులకు దగ్గరగా ఉంటాయి.

 

నేను ఇతర దర్శకుల గురించి మాట్లాడను కానీ మన సంస్కృతిలోని స్టోరీల గురించి నేనెప్పుడూ తప్పుగా చూపించను. రామాయణం, మహాభారతాలను నా స్టైల్లో చూపించాలని అనుకున్నాను. కానీ ఓ డైరెక్టర్ గా నాకు ఆ స్థాయి పరిణతి, అనుభవం లేవని అనుకుంటాను. అందుకే ఆ పాత్రల నుంచి ఫిక్షనల్ స్టోరీలను క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నాను” అని ప్రశాంత్ వర్మ అన్నాడు.

హనుమాన్ మూవీని చాలా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ వీఎఫ్ఎక్స్ తో నిర్మించిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ఆదిపురుష్ మూవీని భారీ బడ్జెట్ తో తీసినా అందులోని నాసిరకమైన వీఎఫ్ఎక్స్ ను విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా హనుమాన్ మూవీతో పోలుస్తూ చాలా మంది ఓంరౌత్ ఆదిపురుష్ మూవీని చెడుగుడు ఆడుకున్నారు.

హనుమాన్ సక్సెస్ తో హిందూ దేవుళ్లే సూపర్ హీరోలుగా తాను 12 సినిమాలు తీయబోతున్నానని, వచ్చే ఏడాది జై హనుమాన్ పేరుతో మరో సినిమా తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.

“వెస్టర్న్ మూవీస్ లోని సూపర్ హీరోస్ లో చూపించే పవర్సే మన దేవుళ్ల దగ్గరా ఉన్నాయి. ఆ పాత్రలే మన ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. హనుమాన్ కూడా అందరికీ నచ్చే, మెచ్చే అలాంటి పాత్రే. మేము ఇలాంటి సూపర్ హీరోల సినిమాలు తీయాలని అనుకున్నప్పుడు అది హనుమంతుడితో ప్రారంభించాలని నిర్ణయించాం” అని ప్రశాంత్ వర్మ చెప్పాడు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024