Best Web Hosting Provider In India 2024
Dubbaka BRS Mla: కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి పంటకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి నీరు ఇవ్వకుండా రాజకీయ లబ్ది కోసం జాప్యం చేస్తోందని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
ట్రెండింగ్ వార్తలు
రైతుల కోరిక మేరకు, తాము మల్లన్న సాగర్ దగ్గరికి వెళ్లి, ప్రాజెక్ట్ గేట్లు లేపి నీరు వదలాలని కోరగా అధికారులు తిరస్కరించారని, ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాసంగి పంటకు నీరు వదిలితే, ఇంతకు ముందు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి పేరొస్తదనే భయంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నదని దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపించారు.
ఇప్పటికే రైతులు యాసంగి నాట్లు మొదలు పెట్టినందున, రామాయంపేట కెనాల్ కు, కూడవెల్లి వాగుకు నీరు విడుదల చేయాలనీ రైతులు తమను ప్రతిరోజు కలుస్తున్నారన్నారు.
తప్పు చేస్తే జైలుకు పంపండి…
నీటి విడుదల కోసం తాను ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశానని, సాగు నీరు విడుదల చేయటంలో ఇంకా జాప్యం చేస్తే తాము రైతాంగం తరపున నిలబడి పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోఉన్నప్పుడు, రైతుల నుండి నీరు విడుదల చేయాలనీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎమ్మటే నీరు విడుదల చేసే వాళ్లమని అయన ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకులూ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా తప్పు చేసి ఉంటే తమను జైలు కు పంపించాలని కోరుతూ, ఏవో సాకులు చూపిస్తూ నీటిని విడుదల చేయకుంటే రైతాంగానికి అన్యాయం చేయొద్దన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచుకున్నడన్నారు. సిద్దిపేట జిల్లాలోనే మూడు రిజర్వాయర్లు కట్టి, ఈ ప్రాంతపు రైతులకు ఎంతో మేలు చేసాడని అయన కొనియాడారు.
ఇంతకు ముందు తాము అధికారంలో ఉన్నప్పుడు, వరుసగా మూడు సంవత్సరాలు రిజర్వాయర్ల నుండి పంటల కోసం నీటిని వదిలామని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరుని అందించే బాధ్యత తనదేనని, అయితే రైతులు కూడా తాము కాల్వల నిర్మాణానికి భూమి ఇవ్వటానికి ముందు రావాలని అయన పిలుపునిచ్చారు.
ఎవరు భూమి ఇవ్వకుండా కాల్వల నిర్మాణం పూర్తి కాదని అయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎంతో మంది రైతులు తమ భూములు ఇస్తేనే ఈ రోజు మనమందరం ఆ త్యాగాల ఫలితాన్ని అనుభవిస్తున్నామన్నారు.
కాల్వల నిర్మాణంల, భూమి కోల్పోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని తాను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఇప్పటికే కోరానని, తాను ఇట్టి విషయం పైన ఒక వారంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు.
టాపిక్