Best Web Hosting Provider In India 2024
world’s largest residential building: అతి పెద్ద ఇల్లు అనగానే అందరికీ ముంబైలోని ముకేశ్ అంబానీకి చెందిన యాంటీలియా భవనం గుర్తొస్తుంది, లేదా బ్రిటిష్ రాజ కుటుంబం నివసిస్తున్న బకింగ్ హామ్ ప్యాలెస్ గుర్తుకొస్తుంది. ఈ రెండింటిని మించిన అతి పెద్ద నివాస భవనం మన భారతదేశంలోనే ఉంది. అది గుజరాత్ లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇప్పటికీ దీనిలో ఒక కుటుంబం నివసిస్తోంది. బ్రిటన్లోని రాజకుటుంబం నివసిస్తున్న బకింగ్ హామ్ ప్యాలెస్ తో పోలిస్తే ఇది నాలుగు రెట్లు పెద్దది. 1889లో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంట్లో గైక్వాడ్ వారసుడైన సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్, అతని భార్య రాధికా రాజే గైక్వాడ్ వారి ఇద్దరు కుమార్తెలు నివసిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఇంటిని కట్టడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. 18వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఈ ప్యాలెస్ లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. టెలిఫోన్ ఎక్స్చేంజ్, లిఫ్టులు, నిత్యం విద్యుత్ సరఫరా వంటివి అప్పుడే ఏర్పాటు చేశారు. మహారాజా సాయాజీరావు గైక్వాడ్ 3 ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని తలపెట్టారు. అప్పట్లో మేజర్ చార్లెస్ మాంట్ అనే బ్రిటన్ ఆర్కిటెక్ట్ ఈ విలాస భవనం నిర్మాణాన్ని ప్రారంభించారు. అంతకుముందే భారత దేశంలోని కొల్లాపూర్, దర్భంగాలో ఆయన ప్యాలస్‌లను నిర్మించారు. లక్ష్మీ విలాస్ అతనికి దక్కిన అతి పెద్ద ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న చిన్న తప్పులు చేశారని, అందుకే చార్లెస్ మాంట్ ఆత్మహత్య చేసుకున్నాడని కధలు వినిపిస్తాయి. ఇవి ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు.
ఈ ప్యాలెస్‌ను నాలుగు అంతస్తులలో 700 ఎకరాల్లో నిర్మించారు. 170 గదులు ఇందులో ఉన్నాయి. ఎంతో అందంగా రూపొందించిన ఉద్యానవనాలు, గోల్ఫ్ కోర్సులు, భారీ పార్కులు, విందులు, సమావేశాల కోసం సెంట్రల్ హాళ్లు, మ్యూజియం, క్రికెట్ గ్రౌండ్, టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్టు, జూ వంటివన్నీ ఈ రాజభవనంలో నిర్మించారు. అంతేకాదు ఈ రాజ భవనం చుట్టూ రాజ కుటుంబీకుల పిల్లలను తిప్పడానికి ఒక రైల్వే ట్రాక్ కూడా నిర్మించారు. పిల్లలను ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్న చిన్న రైల్లోనే తిప్పేవారు. సరస్సులను కూడా ఈ ప్యాలెస్ లో నిర్మించారు.
అప్పట్లోనే ఈ ఇంటిని నిర్మించడానికి 60 లక్షల రూపాయలు ఖర్చయినట్టు చెబుతారు. 140 ఏళ్ల క్రితం 60 లక్షల రూపాయలు అంటే అది చాలా ఎక్కువ మొత్తం. ఈ ప్యాలెస్ ను చూడాలనుకుంటే ఎవరైనా వెళ్ళవచ్చు. ప్యాలెస్ ఎంట్రీ ఫీజు 150 రూపాయలు. మ్యూజియాన్ని చూడాలంటే 60 రూపాయలు చెల్లించాలి.
ప్రస్తుతం ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విలువ 24 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ ప్యాలెస్ లో ఎన్నో సినిమాలను కూడా తీశారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కనిపించే ప్యాలస్ ఇదే. అలాగే కొన్ని హిందీ సినిమాల్లో కూడా ఈ ప్యాలస్ కనిపిస్తుంది.
టాపిక్