Best Web Hosting Provider In India 2024
Sapta Sagaralu Dhaati Side B OTT: కన్నడలో సప్త సాగర దాచె ఎల్లో సైడ్-ఏ చిత్రం గతేడాది సూపర్ హిట్ అయింది. తెలుగులో సప్తసాగరాలు దాటి సైడ్-ఏ పేరుతో ఈ మూవీ రిలీజ్ కాగా.. ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. దానికి సీక్వెల్‍గా ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమా గతేడాది నవంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ లవ్ స్టోరీ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. రెండు నెలలు పూర్తయినా ఈ చిత్రం ఇంకా రాకపోవటంతో నిరీక్షిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో కొంతకాలంగా కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సైడ్-ఏ ఈ ప్లాట్‍ఫామ్‍లోనే స్ట్రీమ్ అవుతోంది. దీంతో సైడ్-బీ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో హీరో రక్షిత్ శెట్టి స్పందించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో సప్తసాగరాలు దాటి సైడ్-బీ త్వరలో వస్తుందని రక్షిత్ శెట్టి నేడు (జనవరి 20) ట్వీట్ చేశారు. “ఎస్ఎస్ఈ సైడ్‍బీ త్వరలో అమెజాన్‍లోకి వస్తుంది. ఖరారు చేశాక తేదీని ప్రకటిస్తాం” అని ఆయన వెల్లడించారు. దీంతో త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై అమెజాన్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈనెలాఖరులో లేదా ఫిబ్రవరి ఆరంభంలోనే సప్తసాగరాలు దాటి సైడ్-బీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సప్తసాగరాలు దాటి సైడ్-బీ మూవీలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రలు చేశారు. చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్, జేపీ తుమినాడ్, రమేశ్ ఇందిర, గోపాల్ కృష్ణ పాండే తదితరులు కీలకపాత్రలు పోషించారు. హేమంత్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఆకట్టుకుంది.
ఇదీ ‘సైడ్-బీ’ కథ
ప్రాణంగా ప్రేమించుకున్న మనూ (రక్షిత్ శెట్టి), ప్రియా (రుక్మిణీ వసంత్) ఊహించని ఘటనతో దూరమవుతారు. చేయని తప్పునకు మనూ జైలుకు వెళతాడు. దీంతో వీరిద్దరూ విడిపోవడం సప్తసాగరాలు దాటి సైడ్-ఏలో ఉంటుంది. దానికి కొనసాగింపుగా సప్తసాగరాలు దాటి సైడ్-బీ వచ్చింది. సైడ్-బీలో మనూ జైలు నుంచి విడుదలవుతాడు. అప్పటికే వేరే వ్యక్తితో ప్రియాకు పెళ్లి అవుతుంది. అయితే, ప్రియా వైవాహిక జీవితం ఎలా ఉందో మనూ పరిశీలిస్తుంటాడు. ఆమె కష్టాలను తీర్చేందుకు నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మనూకు సురభి (చైత్ర జే అచార్) అనే వేశ్య పరిచయం అవుతుంది. ప్రియాకు దూరంగా ఉంటూనే సాయం చేస్తూనే ఉంటాడు మనూ. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రియా, మనూ ఎదురుపడ్డారా? మనూ జీవితంలో సురభి ఎలా వచ్చింది? అనేదే సప్తసాగరాలు దాటి సైడ్-బీ కథలో ముఖ్య అంశాలుగా ఉన్నాయి.