Best Web Hosting Provider In India 2024
Most Watched TV Show in 2023: ఎప్పుడో ఐదేళ్ల కిందట ముగిసిన టీవీ షోనే 2023లో మరోసారి అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన టీవీ షోగా నిలవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రూపొందించిన లీగల్ డ్రామా సిరీస్ సూట్స్ (Suits) ఈ ఘనత దక్కించుకుంది.
ట్రెండింగ్ వార్తలు
2019లోనే ఈ షో ముగియగా.. 2023లో ఏకంగా 5770 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్ తో టాప్ లో నిలవడం గమనార్హం. ది బిగ్ బ్యాంగ్ థియరీ, ఫ్రెండ్స్ లాంటి సిరీస్ లను కూడా వెనక్కి నెట్టిందీ సూట్స్.
సూట్స్.. ఎక్కువ మంది చూసిన సిరీస్
నెట్‌ఫ్లిక్స్ 2023లో కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సిరీస్ లను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కానీ ఓటీటీ ప్రేక్షకులు మాత్రం 2019లోనే ముగిసిన సూట్స్ సిరీస్ ను ఆదరించారు. ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్న మేఘన్ మార్కిల్ నటించిన ఈ సూట్స్ సిరీస్ ఎంతో మందికి తెగ నచ్చేసింది. ఇందులోని డైలాగులు, భిన్నమైన కథలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
గతేడాది జూన్ లో ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టింది. తాజాగా నీల్సన్ రిలీజ్ చేసిన టాప్ 10 మోస్ట్ వాచ్డ్ టీవీ షోల్లో సూట్స్ టాప్ లో నిలిచింది. ఈ షోకి ఏకంగా 57.7 బిలియన్ (5770 కోట్ల) వ్యూయింగ్ మినిట్స్ నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఈ సూట్స్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ తోపాటు పీకాక్ లోనూ అందుబాటులో ఉంది.
టాప్ టీవీ షోస్ ఇవే
సూట్స్ షోలో మొత్తంగా 9 సీజన్ల పాటు 141 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ లీగల్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. మొత్తంగా అన్ని ఎపిసోడ్లు కలిపి అన్ని వేల కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్ ను నమోదు చేశాయి. ఇక సూట్స్ తర్వాత డిస్నీ ప్లస్ కు చెందిన షో బ్లూయి (Bluey) నిలిచింది. 145 ఎపిసోడ్లు ఉన్న ఈ షోకి 2023లో 4390 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్ వచ్చింది.
మూడోస్థానంలో అమెరికన్ మిలిటరీ పోలీస్ టీవీ సిరీస్ ఎన్‌సీఐఎస్ నిలిచింది. ఈ షోకి 3940 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్ నమోదైంది. నెట్‌ఫ్లిక్స్, పారామౌంట్ ప్లస్ లలో కలిపి ఇంత వ్యూయర్షిప్ వచ్చింది. గ్రేస్ అనాటమీ (3860 కోట్ల నిమిషాలు), కొకొమెలాన్ (3630 కోట్ల నిమిషాలు), ది బిగ్ బ్యాంగ్ థియరీ (2780 కోట్ల నిమిషాలు), గిల్మోర్ గర్ల్స్ (2520 కోట్ల నిమిషాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక ప్రపంచంలోని టీవీ ప్రేక్షకుల ఫేవరెట్ సిరీస్ అయిన ఫ్రెండ్స్ ఈ లిస్టులో 8వ స్థానంలో ఉంది. ఈ షోలో నటించిన మాథ్యూ పెర్రీ అకాల మరణంతో ఈ షోకి మరోసారి డిమాండ్ పెరిగింది. 2023లో 2500 కోట్ల వ్యూయింగ్ మినట్స్ నమోదయ్యాయి.