Best Web Hosting Provider In India 2024
Chandrababu Delhi Tour : టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. బుధవారం రాత్రి లేదా రేపు అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం వరకు హెలికాఫ్టర్ లో వెళ్లిన చంద్రబాబు, ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రికి దిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు. చంద్రబాబు పర్యటనలో బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 2014 ఎన్నికల తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయంటున్నారు. దిల్లీకి బయలుదేరే ముందు చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. దిల్లీ నుంచి పిలుపు వచ్చిందని పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు తెలిపారు. అయితే అక్కడికి వెళ్లాకే ఎందుకు పిలిచారో తెలుస్తుందని చంద్రబాబు వారితో అన్నట్లు సమాచారం. అమిత్ షాతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
చంద్రబాబు దిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ ఆచీతూచి వ్యవహరిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు ముందు చంద్రబాబు దిల్లీలో అమిత్‌షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న సమయంలో లోకేశ్ రెండు సార్లు అమిత్ షాతో చర్చలు జరిపారు. ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి అమిత్‌షాను లోకేశ్ కలిశారు. ఆ సమయంలోనే టీడీపీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
వైసీపీ రియాక్షన్
అయితే చంద్రబాబు దిల్లీ పర్యటనపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు దిల్లీ పర్యటనలో కొత్తేముందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన… బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు మాట్లాడతానన్నారు. ఎన్నికల ముందు పొత్తులు చంద్రబాబు అలవాటేనని విమర్శించారు. చంద్రబాబు ఎవరితో కలిసినా ప్రయోజనం లేదన్నారు. ప్రజలు వైసీపీ వైపు ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు మంచి జరిగిందన్నారు. చంద్రబాబు ఎవ్వరితో పొత్తులు పెట్టుకున్నా తమకు సంబంధం లేదన్నారు. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వైసీపీలో కొందరు అసంతృప్తి ఉంటే ఏం చేస్తామన్న బొత్స… ఎవరినీ వదులుకోమన్నారు. టికెట్ రాని వారికి కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. అసంతృప్తికి ఎండ్ ఉండదన్నారు. షర్మిల భద్రత తగ్గింపుపై స్పందించిన మంత్రి బొత్స… భద్రతపై ప్రభుత్వానికి కొన్ని షరుతులు ఉంటాయని, ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తారన్నారు. ఆ విషయం అధికారులు చూసుకుంటారన్నారు.
పురంధేశ్వరి ఏమన్నారంటే?
చంద్రబాబు దిల్లీ పర్యటనపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. పొత్తులు ఎలా ఉండాలో బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తారన్నారు. చంద్రబాబు దిల్లీ ఎందుకు వెళ్లారో తనకు తెలియదన్నారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందని, ఇతర పార్టీలతో కలిసి సాగే విషయంలో నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని పురంధేశ్వరి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్