Best Web Hosting Provider In India 2024
Siddipet District Crime News: సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పొలం గెట్టు దగ్గర చెట్లు తొలగిస్తున్న సమయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవ జరిగింది. అన్న క్షణికావేశంలో తమ్ముడిపై గొడ్డలితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వింజపల్లి గ్రామానికి చెందిన కొమ్ముల తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి(36) ఇద్దరు అన్నదమ్ములు. వీరికి పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా అన్న తిరుపతి గట్టుపై చెట్లు తొలగించడానికి కూలీలను తీసుకొని వెళ్ళాడు. చెట్ల కొమ్మల మధ్య కరెంట్ తీగలు,ఓ చెట్టుకు స్టార్టర్ డబ్బా ఉండడంతో వాటిని తొలగించారు. దీంతో తమ్ముడు శ్రీనివాస్ కూలీలను తిట్టడంతో వారు మీ అన్న తీసివేయమన్నాడని తెలిపారు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన తిరుపతి రెడ్డి గొడ్డలి తీసుకొని శ్రీనివాస్ రెడ్డి మెడపై దాడి చేయగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి రెడ్డి,కూలీలు అక్కడి నుండి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి,విచారణ జరిపారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లాలో మరొకరు …..
పొలాల మధ్య జరిగిన భూతగాదాలలో జరిగిన ఘర్షణలో గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుర్తీవాడకు చెందిన మెట్టు రాములు,యశోద దంపతులకు ఇద్దరు కుమారులు లక్ష్మయ్య (36),యాదగిరి ఒక కూతురు విజయలక్ష్మి ఉన్నారు. వీరికి పాలోళ్లతో భూమి,ఆస్తి విషయంలో కొన్ని సంవత్సరాల నుండి గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో సోమవారం రాత్రి మరల భూమి విషయంలో గొడవ జరిగింది. కాగా బంధువులు,పాలోళ్లు అయిన మెట్టు సావిత్రి,కిష్ణమ్మ,మోహన్ వీరితో పాటు మరికొందరు కలిసి రాములు పెద్ద కొడుకు లక్ష్మయ్య పై బండరాళ్లు,కర్రలతో దాడి చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని ఈదాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను 108 వాహనంలో మెదక్ ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉండడంతో గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మయ్య మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి రాములు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై తెలిపారు.
రిపోర్టింగ్ – ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి.
టాపిక్