Best Web Hosting Provider In India 2024
SS Rajamouli on Gaami: ప్రస్తుతం సినీ జనాల్లో గామి సినిమాపై విపరీతమైన ఆసక్తి ఉంది. అద్భుతమై విజువల్స్‌తో ట్రైలర్ ఉండడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. టేకింగ్, వీఎఫ్‍ఎక్స్, హీరో విశ్వక్‍సేన్ యాక్టింగ్.. గామి ట్రైలర్లో చాలా ఆకట్టుకున్నాయి. దీంతో విశ్వక్ ప్రధాన పాత్ర పోషిస్తున్న గామి మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మూవీ మరో రెండు రోజుల్లో (మార్చి 8న) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో గామి సినిమాపై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు.
ట్రెండింగ్ వార్తలు
అసాధ్యమైన కలలను అంకిత భావంతో, నిరంతర శ్రమతో సాధించారని గామి టీమ్‍ను రాజమౌళి ప్రశంసించారు. గామి దర్శకుడు విద్యాధర్ కగిట, నిర్మాత కార్తిక్ తనను కలిసి 4 ఏళ్ల శ్రమ గురించి చెప్పారని వెల్లడించారు.
గామి సినిమా గురించి తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు రాజమౌళి. “అసాధ్యమైన కలలు.. కానీ వాటిని సాకారం చేసుకునేందుకు అలుపెరగకుండా కష్టపడ్డారు. అద్భుతమైన విజువల్స్ సాధించేందుకు తాము పడిన నాలుగేళ్ల కష్టాన్ని నిర్మాత కార్తిక్, దర్శకుడు విద్యాధర్ చెప్పినప్పుడు నాకు కలిగిన భావన ఇది. గామి మార్చి 8న రిలీజ్ కానున్న తరుణంలో మూవీ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతున్నా” అని రాజమౌళి పేర్కొన్నారు.
గామి చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.
గామి సినిమా కోసం దర్శకుడు విద్యాధర్ సుమారు ఐదేళ్లుగా పని చేస్తున్నారు. ఈ చిత్రం ఎంతో పరిశోధన చేసినట్టు ఆయన తెలిపారు. తక్కువ బడ్జెట్‍లోనే మంచి విజువల్స్, ఔట్‍పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎక్కువ సమయం తీసుకుంది గామి టీమ్. ఈ నగరానికి ఏమైంది సినిమా ముందు నుంచే గామి చేస్తున్నారు హీరో విశ్వక్‍సేన్.
గామి ట్రైలర్‌పై పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఉందని పొగిడారు. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ మూవీ టీమ్‍ను గతంలోనే ప్రశంసించారు. మొత్తంగా గామి సినిమాపై మాత్రం హైప్ పెరుగుతూనే ఉంది.
హిమాలయాల్లో..
గామి చిత్రంలో విశ్వక్‍సేన్ అఘోర పాత్ర చేశారు. మానవుల స్పర్శతో తనకు ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు హిమాలయాల్లోని త్రివేణి ఘాట్ వద్దకు సాహసోపేతమైన ప్రయాణాన్ని చేయడం గురించే గామి మూవీ ఉండనుంది. హిమాలయాల్లో ఈ సినిమాను చాలా శాతం చిత్రీకరించింది మూవీ టీమ్. కాశీలోనూ షూటింగ్ జరిగింది. చాలా సవాళ్లను ఎదుర్కొని హిమలయాల్లోని శీతల ప్రదేశాల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు.
గామి చిత్రంలో చాందినీ చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెద్ద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాక్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రంలో అఘోర సాహస ప్రయాణంతో పాటు చాలా అంశాలు ఉండనున్నాయి. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్లో చాలా ఆకట్టుకుంది. నరేశ్ కుమారన్ ఈ మూవీకి సంగీతం అందించారు. కార్తిక్ శబరీశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్స్ సమర్పిస్తోంది.
భారీగా బుకింగ్స్
గామి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రానికి టికెట్ల బుకింగ్ జోరుగా సాగుతోంది. మంచి అంచనాలు ఉండటంతో భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్ భారీగానే వచ్చేలా కనిపిస్తోంది. విజువల్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని ఇప్పటికే అంచనాలు ఏర్పడగా.. కథ, కథనాలు కూడా బాగుంటే ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవడం పక్కాగా కనిపిస్తోంది.
టాపిక్