Best Web Hosting Provider In India 2024
Vemulawada Police Station: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో (Vemulawada)పోలీసులు దారి తప్పారు. అడ్డదారులు తొక్కెవారిని దారిలో పెట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కడంతో పోలీస్ బాస్ కొరడా ఝుళిపించారు. పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(సిఐ) P.కరుణాకర్ పై బదిలీ వేటు వేసిన పోలీస్ బాస్, తాజాగా ముగ్గురు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఇటీవల జరిగిన మహాశివరాత్రి, శివకళ్యాణ మహోత్సవం సందర్భంగా వేములవాడలోని వ్యాపారులు భక్తుల కోసం బెల్లం అమ్మకాలు జోరుగా సాగించారు. బెల్లం విక్రయించే వ్యాపారులను సిఐ పోలీసుల ద్వారా బెదిరించి ఓ బెల్లం వ్యాపారి వద్ద నుంచి లక్షా 50 వేల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సిఐ అవినీతి ఆరోపణలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా సిఐ కరుణాకర్ ను వేములవాడ నుంచి మల్టీ జోన్-వన్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు…
అవినీతి ఆరోపణలతో సిఐని బదిలీ చేసిన పోలీస్ బాస్… వేములవాడ లో (Vemulawada Police)పని చేసే 9 మంది కానిస్టేబుళ్ళ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్డ్ చేశారు. అమ్యామ్యాలకు అలవాటు పడ్డ శంకర్, అరుణ్ సురేశ్ ముగ్గురిని ఎస్పీ సస్పెండ్ చేశారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్ళు, ఐదుగురు హోంగార్డులను ఇటీవల హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. అడ్డదారిలో అవినీతికి పాల్పడే వారికి షాక్ ఇచ్చేలా పోలీస్ బాస్ చర్యలు చేపట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దైవ భక్తితో వచ్చే భక్తులు స్వామివారికి సమర్పించే బెల్లం పక్క దారి పడుతుందని వ్యాపారులను వేధిస్తూ వసూళ్ళకు పాల్పడడంతోనే చర్యలు చేపట్టినట్లు వేములవాడ భక్తజనం భావిస్తుంది.
రిపోర్టింగ్ – K.Vijender Reddy Karimnagar, HT Correspondent
టాపిక్