Best Web Hosting Provider In India 2024
Salaar TRP: ఒకప్పుడు టీవీలో చాన్నాళ్ల తర్వాత ఓ హిట్ సినిమా వచ్చినా మంచి టీఆర్పీ నమోదయ్యేది. కనీసం రెండంకెల టీఆర్పీలను సినిమాలు సొంతం చేసుకునేవి. కానీ క్రమంగా ఈ టీఆర్పీలు తగ్గిపోతూ వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ టీఆర్పీ దారుణంగా ఉంది. ఈ మధ్యే ఈ సినిమా స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయింది.
సలార్ టీఆర్పీ
సలార్ సినిమాకు కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే రావడం గమనార్హం. నిజానికి ఈ మధ్య కాలంలో జెమినీ టీవీల్లో వస్తున్న సినిమాలకు లోయెస్ట్ టీఆర్పీలు నమోదవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ స్టార్ మా ఛానెల్లో వచ్చిన ఈ సలార్ ను కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం, నా సామిరంగ లాంటి సినిమాలు కూడా దీనికంటే ఎక్కువ టీఆర్పీ సొంతం చేసుకున్నాయి.
నాగార్జున నటించిన నా సామిరంగ మూవీకి 8 టీఆర్పీ నమోదైంది. కానీ సలార్ అంతకంటే తక్కువ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల వరకూ వసూలు చేసిన సలార్ మూవీని.. టీవీల్లో ప్రేక్షకులు ఆదరించలేదు. మూడు ఫెయిల్యూర్స్ తర్వాత ప్రభాస్ కు దక్కిన హిట్ ఇది. అలాంటి మూవీకి కూడా టీవీల్లో పెద్దగా ఆదరణ లభించలేదు.
ఐపీఎల్ కారణమా?
అయితే సలార్ మూవీకి తక్కువ టీఆర్పీల వెనుక ఐపీఎల్ కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. సాయంత్రం కాగానే చాలా వరకూ టీవీల్లో ఐపీఎల్ మ్యాచ్ లను చూడటానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గత నెలన్నర రోజులుగా టీవీల్లో వస్తున్న సినిమాలకు పెద్దగా టీఆర్పీలు నమోదు కావడం లేదు. ఇక ఓటీటీల హవా పెరగడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు.
ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలు రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. చాలా వరకూ ఇళ్లలో స్మార్ట్ టీవీలు వచ్చేయడంతో ఓటీటీలకు సబ్‌స్క్రైబ్ చేసుకొని కొత్త సినిమాలను ముందే చూసేస్తున్నారు. దీంతో తర్వాత టీవీల్లోకి వచ్చే సమయానికి ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన సలార్ మూవీని అప్పుడే చాలా మంది చూసేశారు.
చాలా రోజుల వరకూ ఆ ఓటీటీలోని టాప్ ట్రెండింగ్ మూవీగా సలార్ నిలిచింది. యానిమల్ వచ్చిన తర్వాత సలార్ హవా కాస్త తగ్గింది. ఇక ఇప్పుడు టీవీల్లో అసలు ఆదరణే లభించలేదు. పైగా సలార్ మూవీలో హింస ఎక్కువగా ఉన్న కారణంగా దీనికి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాంటి సినిమాలకు ఓటీటీలతో పోలిస్తే టీవీల్లో ఆదరణ తక్కువగానే ఉంటుంది.
కుటుంబంతో కలిసి ఇలాంటి సినిమాలను చూడటానికి వెనుకడుగు వేస్తుంటారు. మరోవైపు సలార్ 2 మూవీ షూటింగ్ జూన్ లోనే ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్ శౌర్యాంగపర్వంగా ఈ సీక్వెల్ రాబోతోంది. వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సలార్ ఫస్ట్ పార్ట్ హిట్ అయిన నేపథ్యంలో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.