Best Web Hosting Provider In India 2024
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మరోసారి నిరాశే ఎదురైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ స్టార్ ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదలై డిజాస్టర్ అయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్‌లో మూడు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం యాక్షన్ మూవీ చేస్తున్నారు విజయ్. మరో రెండు చిత్రాలకు ఓకే చెప్పారు. కాగా, మరో రెండు రోజుల్లో మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజున మూడు సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి. అవేంటంటే..
టైటిల్ రివీల్!
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ మూవీ (VD12) చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. విజయ్ పుట్టిన రోజైన మే 9వ తేదీన ఈ చిత్రం టైటిల్‌ను రివీల్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి టైటిల్ ఏదో ఆ రోజున తెలియనుంది.
విజయ్ దేవరకొండ – గౌతమ్ కాంబోలో ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నా ఆమె తప్పుకున్నారు. దీంతో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా మేకర్స్ ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
కొత్త మూవీ అనౌన్స్మెంట్
డైరెక్టర్ రాహుల్ సంకృతియన్తో ఓ మూవీకి విజయ్ దేవరకొండ ఓకే చెప్పారు. గతంలో రాహుల్‌తో విజయ్ చేసిన ట్యాక్సీవాలా మంచి విజయాన్నే సాధించింది. మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. విజయ్ దేవరకొండతో రాహుల్ చేయబోయే మూవీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. దీంతో ఇది కూడా క్రేజీ ప్రాజెక్ట్‌లా కనిపిస్తోంది. మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అధికారికంగా అనౌన్స్మెంట్ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
పోస్టర్ రిలీజ్
ఫ్యామిలీ స్టార్ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌తో మరో మూవీ చేయనున్నారు విజయ్ దేవరకొండ. అయితే, ఈ మూవీ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండనుందని తెలుస్తోంది. ‘రాజా వారు రాణిగారు’ ఫేమ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అశోక వనంలో అర్జున కల్యాణం చిత్రానికి రచయితగానూ ఆయన చేశారు.
విజయ్ దేవరకొండతో తన చిత్రం గురించి ఇటీవలే డైరెక్టర్ రవికిరణ్ కోలా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. హీరో విజయ్, నిర్మాత దిల్‌రాజుతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ పుట్టిన రోజైన మే 9న అప్డేట్ వస్తుందంటూ చెప్పేశారు. అయితే, ఆ రోజున ఈ మూవీ నుంచి కాన్సెప్ట్ పోస్టర్ వస్తుందని తెలుస్తోంది.