Best Web Hosting Provider In India 2024
AP TS Weather Updates: నిన్న మొన్నటి వరకు 47డిగ్రీల ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి దాదాపు నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో ప్రకాశం జిల్లాలో 47డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోవడంతో జనం అల్లాడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా తేమ ప్రభావం, వడగాల్పులతో ప్రజలు ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఏపీలో వాతావరణంలో మార్పులు వచ్చాయి.
ఐఎండి సూచనల ప్రకారం తమిళనాడు మీదగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 గంటలకు వరకు ఏపీలోని 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు 130.6 మిమీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 114.2 మిమీ, కడియంలో 114 మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 110 మిమీ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 102మిమీ, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 98.4మిమీ, వైయస్ఆర్ జిల్లా రాజుపాలెం 95.8మిమీ అధికవర్షపాతం నమోదైంది.
గురువారం శ్రీకాకుళంలో 4, విజయనగరం 3, పార్వతీపురంమన్యం 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బుధవారం కర్నూలు జిల్లా జి. సింగవరంలో 39.7°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 39.4°C, అల్లూరి జిల్లా కొండైగూడెం, అనంతరం కురువల్లిలో 39.3°C, అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో 39.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. గత వారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటిపోవడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఉంది.
తెలంగాణలో కూడా ….
తెలంగాణలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురు శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండి ప్రకటించింది.
మే 12 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు, జల్లులు కురుస్తాయని ప్రకటించింది. 12వ తేదీన తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జకోరా, నిజామాబాద్ అర్బన్‌లో 42.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ఉష్ణోగ్రతల నుంచి రెండు మూడు రోజుల పాటు ప్రజలకు ఉపశమనం దక్కనుంది.
టాపిక్