Best Web Hosting Provider In India 2024
Panchayat 3 Trailer: పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 3 కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. బుధవారం (మే 15) రిలీజైన ఈ ట్రైలర్ కొత్త సీజన్ ఎంతటి వినోదాన్ని పంచబోతోందో కళ్లకు కట్టింది. ఈసారి ఫులేరా ఊళ్లో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండబోతోంది. అదే సమయంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వులూ గ్యారెంటీ అని ట్రైలర్ తో తేలిపోయింది.
పంచాయత్ 3 ట్రైలర్
ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన పంచాయత్ ఇండియాలోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ లలో ఒకటి. ఓ గ్రామం, అందులోని రాజకీయాలు, వాటి మధ్య నలిగిపోయే ఓ పంచాయతీ సెక్రటరీ చుట్టూ తిరుగుతూ ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్ల పాటు అభిమానులను అలరించింది. ఇప్పుడు మే 28వ తేదీ నుంచి మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
దీంతో బుధవారం (మే 15) ఈ మూడో సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండో సీజన్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ మూడో సీజన్ ట్రైలర్ మొదలైంది. ఎమ్మెల్యే ఆగ్రహంతో ఫులేరా నుంచి ట్రాన్స్‌ఫర్ పై వెళ్తాడు అభిషేక్ త్రిపాఠీ (జితేంద్ర కుమార్). అతని స్థానంలో కొత్త సెక్రటరీ వస్తాడు. అయితే ఆలోపే అతని ట్రాన్స్‌ఫర్ రద్దయిందని సర్పంచ్ ఫోన్ చేసి చెప్పడం మళ్లీ అదే ఊరికి తిరిగొస్తాడు.
అక్కడి నుంచీ మళ్లీ అతని బాధలు మొదలవుతాయి. రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్ కొత్త సీజన్లో ఫులేరా పంచాయత్ సచివ్ కొత్తగా ఎదుర్కోబోయే సవాళ్లు, రాజకీయాలు, ఎన్నికల చుట్టూ తిరిగింది. రిజైన్ చేసి వెళ్లిపోయి హాయిగా ఉందామంటే మళ్లీ ఇదే ఊరికి తీసుకొచ్చారంటూ అభిషేక్ త్రిపాఠీ తన అసహనాన్ని వెల్లగక్కడం కూడా ఈ ట్రైలర్ లో చూడొచ్చు.
పంచాయత్ 3 ట్రైలర్ ఎలా ఉందంటే?
ఈ కొత్త సీజన్లో ఫులేరా రాజకీయాలకు దూరంగా ఉండటానికి అభిషేక్ చేసే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక మూడో సీజన్లో ఫులేరా పంచాయతీకి ఎన్నికలు జరగబోతున్నట్లు, అందులో ప్రస్తుత ప్రధాన్ మంజు దేవి (నీనా గుప్తా)కు గట్టి ప్రత్యర్థి తగులుకున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇక ప్రధాన్ కూతురు రింకీతో అభిషేక్ బంధం ఈ సీజన్లో మరింత బలపడినట్లు కూడా చూపించారు.
ఓవరాల్ గా ట్రైలర్ తోనే మూడో సీజన్ పై అంచనాలను భారీగా పెంచేశారు. తొలి రెండు సీజన్లలాగే మూడో సీజన్ కూడా అలరిస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండో సీజన్లో నవ్వులతోపాటు చివర్లో కాస్త భావోద్వేగాలను కూడా జోడించిన మేకర్స్.. ఈ కొత్త సీజన్లో ఏం చేయబోతున్నారో చూడాలి. పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ మే 28 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
కొత్త సీజన్ కోసం రెండేళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సరదాగా సాగిపోయే కామెడీ డ్రామాను ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే.. మూడో సీజన్ స్ట్రీమింగ్ కు రాక ముందే తొలి రెండు సీజన్లను చూసేయండి.