చిరు వ్యాపారులకు సంక్రాంతి కానుక.. ‘జగనన్న తోడు’ నిధులు విడుదల
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేస్తోంది. నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసి వారి పురోభివృద్ధికి దోహదపడుతోంది. వైసీపీ అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలు ఎంతోమంది బడుగు జీవులకు గొప్ప భరోసానిస్తున్నాయి. తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న తోడు’ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. బటన్ నొక్కడం ద్వారా నిధులు విడుద చేశారు. సంక్రాంతి పండగ వేళ సీఎం అందించిన ఈ కానుక పట్ల చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆ తపన, తాపత్రయంతోనే ‘జగనన్న తోడు’
తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల దయనీయ స్థితిని చూసి చలించిపోయానని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ చోటా చిరు వ్యాపారులకు పెట్టుబడి చాలా కష్టంగా మారిపోయిన పరిస్థితిని చూశానన్నారు. రూ.1000 అప్పు కోసం వారు పడే తిప్పలు తనను కలచివేశాయన్నారు. ఇంత అధ్వాన్నంగా ఉన్న సొసైటీలో చిరు వ్యాపారుల బతుకుల్లో శాశ్వత మార్పు తీసుకురావాలని తాను భావించానని పేర్కొన్నారు. ఆ తపన, తాపత్రయంతోనే ‘జగనన్న తోడు’ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
3.95 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు
ఈ పథకం ద్వారా ప్రభుత్వమే పూర్తి వడ్డీ భారాన్ని భరిస్తూ చిరు వ్యాపారులకు రుణాలు అందజేస్తోందన్నారు. సకాలంలో డబ్బులు చెల్లించేవారికి బ్యాంకులు మళ్లీ రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్ధిదారులు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి రీయింబర్స్ చేస్తోందన్నారు. చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని, వారికి మంచి జరగాలని ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 3.95 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన ఆర్నెళ్లలో లబ్ధిదారులు చెల్లించిన వడ్డీని రీయింబర్స్‌మెంట్ ద్వారా తిరిగి వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. అలా రూ.15 కోట్ల వడ్డీని రీయింబర్స్‌మెంట్ చేసినట్లు తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.2406 కోట్లు లబ్ధిదారులకు రుణాల రూపంలో ఇచ్చామన్నారు.
రుణాలు ఇవ్వడంలో దేశంలోనే టాప్
పొందిన రుణాన్ని సకాలంలో బ్యాంకులకు చెల్లించిన 3.67 లక్షల మంది రెండోసారి కూడా రుణం పొందారని తెలియజేసేందుకు గర్వపడుతున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ.39,21,000 కోట్ల రుణాలను ప్రభుత్వాలు ప్రజలకు అందజేశాయని… అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.24,00,6000 కోట్ల రుణాలు అందజేయడం జరిగిందని తెలిపారు. రుణాల పరంగా ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని తెలిపారు.