Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Best Web Hosting Provider In India 2024

Thursday Motivation: మాట సాధారణమైనది కాదు, మాటకి అధి దేవత ‘అగ్ని’. అంటే అగ్ని ఎంత రగులుతుందో మాట కూడా అంతే శక్తివంతమైనది. అగ్ని ఎంత ఉపయోగకరమో, దాన్ని వాడకూడని పద్ధతిలో వినియోగిస్తే అంత ప్రమాదకరం కూడా. మాట కూడా అంతే. మాటలతో ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు. అదే మాటతో మరొకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు. అందుకే అగ్ని ఎంత ప్రయోజనకరంగా వినియోగించుకుంటామో, ఎంత పొదుపుగా వాడతామో, ఎంత జాగ్రత్తగా ఉంటామో.. మాటను కూడా అంతే జాగ్రత్తగా, అంతే పొదుపుగా వాడాలి.

తుపాకి నుంచి వచ్చిన తూటా ఎంత వేగంగా శరీరంలోకి చొచ్చుకెళుతుందో అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు ఆ తూటాను కూడా శస్త్ర చికిత్స చేసి బయటకు తీయవచ్చు. కానీ నోట్లోంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోవడం జరగని పని. కాబట్టి ఒకరి మనసును గాయపరిచేలాగా కఠినమైన మాటలను తూటాల్లా వదలడం మానేయండి. ఒకరి మనసు మెచ్చుకునేలా మాట్లాడడం భౌతిక హింసతోనే సమానం. ఏ మతానికి చెందిన పురాణాలైనా కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

మీ సంస్కారం, మీ మంచితనం, మీ సభ్యత మీరు మాట్లాడే తీరులోనే బయటపడతాయి. కాబట్టి ఒకరిని తిట్టడం, కసురుకోవడం, చులకనగా చూడడం, సూటి పోటీ మాటలు అనడం మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల మీ మనసుకు సంతృప్తి కలగవచ్చు. కానీ ఎదురు వారి మనసు చచ్చిపోతుంది. ఎదుటివారి మనసును చంపే హక్కు మీకే కాదు… ఆ దేవుడికి కూడా లేదు. ఇలా మాటలతో హింసించే వారికి సమాజంలో మంచి పేరు ఉండదు.

మాటలను అదుపులో పెట్టుకున్న వ్యక్తికి మనసు కూడా అదుపులోనే ఉంటుంది. మాటపై అదుపు లేదంటే మీ జీవితం అదుపు తప్పుతుంది. రాక్షసుల్లా మాటలతో విరుచుకు పడకుండా… మాటలను పొదుపుగా వాడుతూ ఋషుల్లా ప్రశాంతంగా జీవించడం మంచిది.

నోటిలో నుంచి వచ్చే మాటను అదుపు చేయగలవాళ్ళు ప్రపంచంలో దేనినైనా జయించగలుగుతారని అంటారు. ముందుగా మీ మాటలను అదుపులో పెట్టేందుకు ప్రతిరోజూ సాధన చేయండి. మాట చాలా శక్తివంతమైనది. చెడ్డ పని కన్నా చెడ్డ మాట త్వరగా ప్రపంచంలో పాకిపోతుంది.

తెలుగులో మాటను అదుపులో ఉంచుకోమని చెప్పే సామెతలు ఎన్నో ఉన్నాయి. నోరు వీపుకు చేటే అనే సామెత ఉంది. అంటే మాట అదుపులో లేకపోతే దెబ్బలు తింటావని అర్థం. అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత కూడా ఉంది. మాట్లాడే మాట అదుపులో ఉంటే… జీవితంలో ఎలాంటి సమస్యలు రావు అనేదే ఈ సామెతల అర్థాలు. ఏది మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో తెలియడం ఒక కళ. ముందుగా ఆ తెలివితేటలను పెంచుకోండి. ఆ కళను నేర్చుకోండి. జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు. మాట అదుపులో పెట్టుకోవడం అనేది ఒక తపస్సు అనుకోండి. ఆ తపస్సు ఈ రోజు నుంచే మొదలుపెట్టండి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024