Best Web Hosting Provider In India 2024
రిటైర్డ్ ఆఫీసర్ని పోలీసు అబ్జర్వర్‌గా నియమించటం ఏంటి?
రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేశారు
ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది.. దాడులు చేస్తున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు
కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది
దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం
పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది
పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం
వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారని, ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయి. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ ప్రజలు, వైయస్ఆర్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు.
కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. పోలింగ్‌కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?. పోలింగ్ రోజు వైయస్ఆర్ సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్ చేశారు.
విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్‌ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది. జరుగుతున్న దాడులన్నీ వన్ సైడే జరుగుతున్నాయి.
మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి వైయస్ జగన్ పాలన రాబోతోంది.
సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ని పోలీసు అబ్జర్వర్‌గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.