Best Web Hosting Provider In India 2024
This Weekend OTT Movies: ఈ వీకెండ్‍లో ఓటీటీల్లో కంటెంట్ చూడాలని అనుకుంటున్న వారి కోసం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. ఈవారం కూడా థియేటర్లలో పెద్దగా సినిమాల రిలీజ్‍లు లేకపోవటంతో ఎక్కువ మంది ఓటీటీలవైపే చూస్తున్నారు. ఈ వారం (మే మూడో వారం) ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు వస్తున్నాయి. చాలా ఎదురుచూస్తున్న ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ వీకెండ్ చూసేందుకు ఓటీటీల్లోకి కొత్తగా వచ్చే ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే..
ఆహాలో రెండు
ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారం రెండు సినిమాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి.
విద్యా వాసుల అహం: ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘విద్యావాసుల అహం’ సినిమా మే 17వ తేదీన అడుగుపెట్టనుంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఆహాలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కించారు. కొత్తగా వివాహం చేసుకునే విద్య (శివానీ), వాసు (రాహుల్ విజయ్) ఈగోలతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించడం చుట్టూ ఈ విద్యా వాసుల అహం కథ తిరుగుతుంది.
షరతులు వర్తిస్తాయి: చైతన్య రావ్, భూమి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం ఆహా ఓటీటీలో మే 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. మార్చి 15న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఆహా ఓటీటీలో వస్తోంది. కుమార్ స్వామి దర్శకత్వం వహించిన షరతులు వర్తిస్తాయి మూవీ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది.
బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్‍స్టార్)
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాల స్ఫూర్తితో ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.
పదకొండున్నర నెలల తర్వాత..
‘జర హట్కే జర బచ్కే’ సినిమా గతేడాది జూన్ 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మంచి హిట్ అయింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజైన పదకొండున్నర నెలల తర్వాత ఈ చిత్రం జియోసినిమా ఓటీటీలోకి వస్తోంది. మే 17వ తేదీన ఈ సినిమా జియోసినిమాలో అడుగుపెట్టనుంది. జర హట్కే జర బచ్కే మూవీ హిందీతో పాటు తెలుగు మరో నాలుగు భాషల్లోనూ స్ట్రీమ్ కానుంది.
జీ5లో ‘బస్తర్’ సినిమా
అదా శర్మ మెయిన్ రోల్ చేసిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రం మార్చి 15న థియేటర్లలో రిలీజ్ అయింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ బస్తర్ మూవీ జీ5 ఓటీటీలో ఈ వారం మే 17న స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీతో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి వస్తుంది.
ఈ వీకెండ్‍లో ఓటీటీల్లో చూసేందుకు ఈ 5 సినిమాలు, బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ ఆప్షన్లుగా ఉన్నాయి. అలాగే, జీ5 ఓటీటీలో తలైమై సేయలగం అనే తమిళ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మే 17న రానుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది.