Best Web Hosting Provider In India 2024
Telangana Rains Updates : హైదరాబాద్లో నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం మధ్యాహ్నం తర్వాత నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది.
జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, నిజాంపేట, జీడిమెట్ల,కూకట్ పల్లి సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. బాలానగర్, మేడ్చల్, కీసర ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్, మెహిదీపట్నం, టోలిచౌక్, గచ్చిబౌలి, చార్మినార్, మలక్పేట్, నాగోల్ ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురిస్తోంది.
మరో 4 రోజులు వర్షాలు….
మరోవైపు తెలంగాణలో మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గురువారం(మే 16) మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన ఈదురుగాలుల వీస్తాయని పేర్కొంది. మే 22వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.
శుక్రవారం(మే 17) భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబనగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్…..
భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే 19న అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే సమయంపై కీలక ప్రకటన చేసింది.
మే 19న అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.మే నెలాఖరులో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ గురువారం తెలిపింది.కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఏపీలోకి రుతుపవనాల ప్రవేశం ఉంటుందని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం….జూన్ తొలి వారంలో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
టాపిక్