మహిళలపై దాడులకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుంది

Best Web Hosting Provider In India 2024

తెలుగు దుశ్శాసునుల పార్టీ.. తెలుగు టెర్రరిస్టుల పార్టీగా టీడీపీ

ఓటమిని జీర్ణించుకోలేకే దాడులకు తెగబడుతున్నారు 

మహిళలపై చంద్రబాబు ఉన్మాద రాజకీయాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి

శాసనమండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కళ్యాణి

విశాఖ‌ప‌ట్నం: పెత్తందార్లంతా కలిసి పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి గాయాలకు గురిచేసి రక్తాన్ని పారిస్తున్నారని, రాజకీయాల్లో ముందెన్నడూ లేనివిధంగా తమకు ఓట్లేయలేదనే కక్షతో పేదలపై దాడులకు దిగిన సంస్కృతిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధంగా అందరూ గుర్తించాలని కోరారు. విశాఖ‌ప‌ట్నంలో ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. 

శ్రీమతి వరుదు కళ్యాణి ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు, తన రాజకీయ లబ్ధికి ఎంతకైనా బరితెగిస్తాడు. ఇవాళ టీడీపీ అంటే తెలుగు డెకాయిట్ల పార్టీగా.. తెలుగు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారై,  బడుగు, బలహీనవర్గాలు, పేదలపై ప్రతాపం చూపుతున్నారు. మహిళలని కూడా చూడకుండా దాడులు చేసి గాయపరుస్తూ తెలుగు దుశ్శాసునుల పార్టీగా, వారి మెడల్లో బంగారు గొలుసులను సైతం దోచేసే తెలుగు దొంగల పార్టీగా ఆ పార్టీ నేతలు తయారయ్యారు. వైయ‌స్‌ఆర్‌సీపీకి ఓట్లేశారన్న కారణంతో మహిళలు, వృద్ధులను టార్గెట్‌ చేసి గాయాలపాల్జేస్తారా..? మీ ఇళ్లల్లోనూ ఆడవాళ్లు, వృద్ధులు లేరా..? మరి, వారిపైన కూడా ఇలాగే ఎవరైనా దాడి చేస్తే మీరు సహించగలరా..? చంద్రబాబు, పురందేశ్వరిది మరీ ఇంత దుర్మార్గమైన రాజకీయం అని ఎవరూ ఊహించలేదు. వారి నిజస్వరూపం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. 

నర్శీపట్నంలో అయ్యన్నపాత్రుడి అరాచకం
నర్శీపట్నం నియోజకవర్గంలోని ధర్మవరం గ్రామానికి చెందిన పాలమూరు రాజకుమారి అనే మహిళపై టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు బూతులు తిట్టి దాడిచేశాడు. ఆమె జగనన్న ప్రభుత్వంలో, వాలంటీర్‌గా పనిచేసి రాజీనామా చేశాక జగనన్న వలన మేలు పొందింది కనుక వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మద్ధతుగా పనిచేసింది. అది తప్పా..? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా తనకు నచ్చిన పార్టీకి పనిచేసుకుంటారు. అలాంటి రాజకుమారిని పట్టుకుని టీడీపీ రౌడీమూకలు ఇంట్లోకి చొరబడి ఇష్టానుసారంగా ఆమెను జుట్టుపట్టి బయటకు ఈడ్చి కొట్టారు. ఆమె దుస్తులు లాగి చెప్పరాని ప్రదేశాల్లో కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచారు. అయ్యన్నపాత్రుడిది మరీ ఇంత అరాచకమా..? ఆయనకు మహిళలంటే ఏరోజూ గౌరవం లేదు. తీవ్రమైన అసభ్యపదజాలంతో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆయన అనుచరవర్గానికి కూడా అంతే సందేశమిచ్చి దాడులకు ఉసిగొల్పుతున్నాడు. అదే మీ ఇళ్లల్లో ఆడవాళ్లు కూడా టీడీపీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎవరైనా అలాగే చిత్రహింసలకు గురిచేసి దాడి చేస్తే బాగుంటుందా..? అంటే, ఓట్లకోసం మహిళలని చూడకుండా దాడి చేసేంతగా దిగజారిపోవాల్నా..? నీకు సిగ్గనిపించడంలేదా అయ్యన్నపాత్రుడు..? అత్యంత జుగుప్సాకరమైన నీ ప్రవర్తనకు మహిళాలోకమంతా అసహ్యించు కుంటున్నారని తెలుసుకో.. 

కృష్ణా, పల్నాడు జిల్లాల్లోనూ మహిళలపై దాడులు
అదేవిధంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉంగుటూరు మండలానికి చెందిన వేముల సంధ్యారాణి అనే మహిళ చేసిన పాపం ఏంటి..? వైయ‌స్‌ఆర్‌సీపీకి ఓటేసిందని టీడీపీ రౌడీమూకలు ఏకంగా ట్రాక్టర్‌ తొక్కించి ఆమెను చంపేద్దామని ప్రయత్నించారు. 
– పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి మరీ వారిని టీడీపీ మూకలు చిత్రహింసలకు గురిచేశారు. చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్న పరిస్థితిని చూశాం. అంటే, వైయ‌స్‌ఆర్‌సీపీకి ఓట్లేసినంత మాత్రాన అదే పాపంగా వారిని చంపేస్తారా..? ఏంటి ఈ టీడీపీ మూకల దౌర్జన్యం ..? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..? 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ.. ప్రతిపక్షంలోనూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరిస్తుంటారు. ఆయన ఇప్పటికే మహిళలను పలు సందర్భాల్లో అవమానకరంగా మాట్లాడమే కాకుండా.. మహళా తహశీల్దార్‌ వనజాక్షి విషయంలోనూ.. రిషితేశ్వరికి అన్యాయం జరిగినప్పుడూ ఆయన అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళాలోకమంతా తీవ్ర ఆగ్రహంతోఉంది.  

చంద్రబాబు, పురందేశ్వరి కనుసన్నల్లో ఐపీఎస్ లు పనిచేయడం విడ్డూరం
రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన దాడులు, ఇంకా కొనసాగుతోన్న అల్లర్లకు కారణం చంద్రబాబు, పురందేశ్వరి కుట్ర రాజకీయాలేననేది అందరికీ తెలిసిపోయింది. పురందేశ్వరితో మాట్లాడించి కేంద్రం ద్వారా ఎన్నికల సంఘానికి ఆదేశాలిప్పించి మరీ అధికార యంత్రాగాన్ని మార్చారు. ఇవాళేమో, పలువురు అధికారులు తప్పిదాలకు పాల్పడినట్టు ఐఏఎస్, ఐపీఎస్‌లపై సైతం చర్యలు తీసుకున్నారు. అంటే, ఆయా అధికారులు చేసిన తప్పులకు బాధ్యులెవరు..? ఖచ్చితంగా చంద్రబాబు, పురందేశ్వరి కనుసన్నల్లోనే పోలీసు అధికారులు వైయ‌స్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేశా రు. ఇది పోలీసు అధికారులకూ మంచి పద్ధతికాదు. 

వైయ‌స్ జగన్‌ ఆదేశానుసారమే సంయమనం పాటిస్తున్న వైయ‌స్‌ఆర్‌సీపీ 
తెలుగుదేశం రౌడీమూకలు ఇప్పటికైనా తమ దాడుల ప్రక్రియను ఆపితే మంచిది. చర్యకు ప్రతిచర్య తీసుకోవడానికి క్షణకాలం కూడా పట్టదని మీరు తెలుసుకోండి. మా అధినాయకుడు సీఎం వైయ‌స్ జగన్‌ ప్రజాస్వామ్య విలువలకు గౌరవాన్ని ఇచ్చే వ్యక్తి కనుకే వైయ‌స్‌ఆర్‌సీపీ కేడర్‌ మొత్తాన్ని సంయమనం పాటించమని ఆదేశాలిచ్చాడు. మీ నాయకుడు చంద్రబాబు మాత్రం ఎంతసేపటికీ దాడులకు ఉసిగొల్పి రక్తపాతం సృష్టిస్తున్నాడు. ఇది ఎంతవరకు సబబో టీడీపీలో ఉన్న సీనియర్లు కూడా గుర్తించాలి. ఇప్పటికే ప్రజల్లో అత్యంత దుర్మార్గమైన వ్యక్తులుగా మీరు ముద్ర పడ్డారు. ఇక, వారిలో ఓర్పు సహనం నశిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచన చేయాలి.  

మళ్ళీ సీఎంగా జగనన్నే..
జూన్‌ 4వ తేదీన కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్ని మనమంతా చూడబోతున్నాం. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మంచి  చేసిన జగనన్న ప్రభుత్వాన్ని కొనసాగించుకునేందుకు పేదలు, మహిళాలోకం, వృద్ధులు, సానుకూల ఓటింగ్‌తో ప్రజాతీర్పును ఇచ్చేశారు. 2019లో సాధించిన స్థానాల కంటే అధిక స్థానాలను వైయ‌స్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుంది. వైయ‌స్‌ జగన్‌ని మళ్ళీ సీఎంగా చూసేందుకు మహిళాలోకమంతా ఎదురుచూస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న దాడులు, అల్లర్లకు ఎవరైతే కారకులుగా ఉన్నారో.. రేపు మేము అధికారంలోకి రాగానే వారిపై స్థాయీభేదం లేకుండా శాఖాపరమైన విచారణతో చర్యలు చేపడతాం. 

Best Web Hosting Provider In India 2024