ఎత్తిపోతలకు గట్టిమేలు……సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాలు .

అమరావతి: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను ప్రణాళిబద్ధంగా నిర్వహించడం ద్వారా ఆయకట్టుకు మరింత సమర్థవంతంగా నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనంచేసి.. మెరుగైన విధానాన్ని రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశించారు.

ఈ విధానం ప్రకారం ఆయకట్టు పరిధిలోని రైతులతో సంఘాలను ఏర్పాటుచేసి ఆయా ఎత్తిపోతలను నిర్వహించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఐడీసీ) పరిధిలో రాష్ట్రంలో 1,117 ఎత్తిపోతల పథకాలున్నాయి. ఇందులో 916 పెద్ద ఎత్తిపోతల పథకాలు. 154 ఎత్తిపోతల పథకాలు మనుగడలో లేవు. చిన్న ఎత్తిపోతల పథకాలు 56 ఉండగా.. అందులో ఒక ఎత్తిపోతల మాత్రమే మనుగడలో లేదు. ఈ ఎత్తిపోతల పథకాల కింద 6,90,183.72 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పథకాల పరిధిలో 3,70,635మంది రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు.

నిర్వహణ లోపంవల్లే..
ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ బిల్లులను ప్రభు­త్వమే చెల్లిస్తోంది. పెద్దపెద్ద మరమ్మతులూ చేయి­స్తోంది. కానీ.. ఈ నిర్వహణ సక్రమంగా లేకపోవడంవల్ల తరచూ నీటి తోడకంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహణ లోపాలను అధిగమించడం.. సమర్థవంతంగా ఎత్తిపోతలను నిర్వహించే విధానాలను రూపొందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఎత్తిపోతల నిర్వహణకు అమలుచేస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అత్యంత సమర్థవంతంగా ఎత్తిపోతలను నిర్వహించే విధానాన్ని రూపొం­దిం­చేందుకు కసరత్తు చేస్తున్నారు.

రైతు సంఘాలతో నిర్వహణ..
ఇక ఎత్తిపోతలను సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించిన విధానం అమలు బాధ్యతను వాటి పరిధిలోని ఆయకట్టు రైతులకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎస్‌ఐడీసీ అధికారుల పర్యవేక్షణలో రైతులే ఎత్తిపోతలను నిర్వహించేలా విధానాన్ని రూపొందించనున్నారు. ఇది రైతుల్లో బాధ్యతను పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ బిల్లులతోపాటు పెద్దపెద్ద మరమ్మతులకు ప్రభుత్వం నిధులు ఇస్తుండటం.. నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించడంవల్ల ఎత్తిపోతల పథకాలు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *