Best Web Hosting Provider In India 2024
Payal Rajput: రక్షణ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నటి పాయల్ రాజ్‌పుత్ చిక్కుల్లో పడింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆమెపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని కౌన్సిల్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఆ ప్రొడ్యూసరే తనను బెదిరిస్తున్నాడని ఆమె చెప్పిన కొన్ని గంటల్లోనే ఇది జరగడం గమనార్హం.
పాయల్ రాజ్‌పుత్‌పై ఫిర్యాదు
పాయల్ రాజ్‌పుత్ నటించిన రక్షణ మూవీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే మూవీ రిలీజ్ కు ముందే పాయల్, మూవీ ప్రొడ్యూసర్ ప్రదీప్ ఠాకూర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్లకు ఆమె రావడం లేదని, ఆమెకు ఇవ్వాల్సిన రూ.6 లక్షల రెమ్యునరేషన్ కూడా ఇచ్చేశానని, అయినా ఆమె సహకరించడం లేదని ప్రదీప్ ఠాకూర్.. తెలుగు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు.
సోమవారం(మే 20) ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపింది. అతడు చేసిన ఫిర్యాదు కాపీని కూడా షేర్ చేసింది. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని పాయల్ ట్వీట్ చేయగా.. కౌంటర్లో ప్రదీప్ మాత్రం మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చేశానని, అయినా ఆమె ప్రమోషన్లకు రావడం లేదని అన్నాడు.
గత మార్చి నెలలోనే అతడు ఈ ఫిర్యాదు చేసినట్లు నిర్మాత మండలి తమ ప్రెస్ నోట్ లో చెప్పింది. ఏప్రిల్లోనే తాము సినిమా రిలీజ్ చేయాలని భావించినా.. నాలుగేళ్ల కిందటి సినిమా కావడంతో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చెప్పిందని ఆ ఫిర్యాదులో నిర్మాత ఆరోపించాడు. ప్రమోషన్లకు వస్తే మిగిలిన రెమ్యునరేషన్ కూడా ఇచ్చేస్తామని చెప్పినా ఆమె రాలేదని చెప్పాడు.
నిర్మాతల మండలితోపాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలకు కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది. పాయల్ సినిమాలో నటించిందని, ఆమె పేరు వాడుకునే హక్కు ప్రొడ్యూసర్ ప్రదీప్ కు ఉందని కూడా స్పష్టం చేసింది.
వాళ్లు బెదిరిస్తున్నారు: పాయల్
అంతకుముందు ఆదివారం (మే 19) పాయల్ రాజ్‌పుత్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. రక్షణ సినిమాను ప్రమోట్ చేయకపోతే తనను టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారని ఆ ట్వీట్ లో ఆమె ఆరోపించింది. “నేను రక్షణ అనే సినిమా చేశాను. నిజానికి 2019, 2020లోనే 5డబ్ల్యూస్ పేరుతో మూవీ షూటింగ్ చేశారు. సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఇప్పుడు వాళ్లు నా సక్సెస్ ను వాడుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారు. నాకు ఇవ్వాల్సిన మిగిలిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా ప్రమోషన్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగానే కుదిరిన ఒప్పందాల కారణంగా తాను అందుబాటులో ఉండనని తన టీమ్ చెప్పినా వినకుండా తనను తెలుగు సినిమా నుంచి నిషేధిస్తామని బెదిరిస్తున్నారు” అని పాయల్ వెల్లడించింది.
ఈ మధ్య తాను నేరుగా కలిసినప్పుడు అసభ్యకరంగా మాట్లాడారని కూడా ఆరోపించింది. దీనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. అంతేకాదు తన అంగీకారం లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని కూడా పాయల్ మండిపడింది. రక్షణ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పాయల్ నటించింది.