Best Web Hosting Provider In India 2024
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన చెప్పిన జీవిత సత్యాలు విజయం సాధించేందుకు ఉపయోగపడతాయి. ఈ కాలంలోనూ చాణక్య నీతిని పాటించేవారు ఉన్నారు. దీనిద్వారా జీవితంలో గెలించేందుకు మార్గాలు వెతుక్కుంటారు. సమాజం, బంధం.. ఇలా అనేక విషయాలు గురించి చాణక్యుడు చెప్పాడు. అలాగే ప్రతీ కుటుంబంలో ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అప్పుడే కుటుంబం సంతోషగా నడుస్తుంది.
ఇంటికి ఒక యజమాని ఉండాలి. ఇంటి బాధ్యతలన్నీ తానే నిర్వహించాలి. కుటుంబ అవసరాలు తీర్చాలి. కొన్ని ఇళ్ళలో పేరుకే యజమాని కావడం మనం గమనించి ఉండవచ్చు. కానీ ఇంటి అధికారం మరొకరి చేతుల్లో ఉంటుంది. ఇంకా కొన్ని ఇళ్లలో హిట్లర్ లాగా ప్రవర్తించే పెద్ద మనుషులు కూడా ఉంటారు. ఇది చేయకూడదు, అది అస్సలే చేయకూడదని ఆదేశాలు ఇస్తారు.
చాణక్యుడి ప్రకారం, ఇంట్లో పెద్దమనిషికి కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడే అతను సమర్థుడైన యజమానిగా చెప్పవచ్చు. చాణక్యుడి ప్రకారం ఇంటి యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చూద్దాం.
ఆదర్శంగా ఉండాలి
ఇంట్లో పిల్లలు ఇంటి పెద్దలను చూసుకుని జీవిత పాఠాలు నేర్చుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఇంటి యజమాని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. అంతే కాకుండా ఒంటరిగా తాగడం, సరదాగా గడపడం లాంటి దుష్ప్రవర్తనకు పాల్పడకూడదు. వీటిని పిల్లలు చూస్తే నేర్చుకునే అవకాశం ఉందని చాణక్య నీతి వివరిస్తుంది. పిల్లలకు కూడా డబ్బు ప్రాముఖ్యత గురించి నేర్పించాలి. ఎంత ఖర్చు చేయాలి? ఎలా ఖర్చు చేయాలో చెప్పాలి.
సమయం కేటాయించాలి
చాణక్య నీతి ప్రకారం ఎంత పెద్ద వ్యక్తి అయినా, తన కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలి. మీకు సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి, వారితో అందమైన క్షణాలను గడపాలి. వారి కష్టాలు, సంతోషాలు, సమస్యలు మీకు తెలుస్తాయి. ఇంట్లో ఏం జరుగుతుందో కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడే తెలుస్తుందని చాణక్య నీతి చెబుతుంది.
గొడవలు వద్దు
చాణక్యుడి ప్రకారం ఇంట్లో ఆనందం, శాంతి, ప్రశాంతత ఉండాలంటే యజమాని తన సోదరుడు, సోదరితో మంచి సంబంధం కలిగి ఉండాలి. సోదరులు, సోదరి సరిగ్గా ఉంటనే కచ్చితంగా ఇంటికి అందం. వీలైనంత వరకు ఇంటిని కుటుంబ సభ్యులతో సామరస్యంగా నడిపించాలి. ఇంట్లో వాళ్లతో గొడవలు పెట్టుకోవద్దు.
సమానంగా చూడాలి
ధనికుడైనా పేదవాడైనా ఇంట్లో యజమాని పాత్ర చాలా ముఖ్యం. ఇంటిని సమర్థంగా నిర్వహించే వ్యక్తి అలాంటి కుటుంబంలో సంతోషంగా ఉంటాడు. అంతేకాదు ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే అందరివైపున మాట్లాడాలి. ఒకరివైపునే స్టాండ్ తీసుకోకూడదు. అలా చేస్తే మిగతా వారి దృష్టిలో తక్కువైపోతారు. కుటుంబ సభ్యులందరినీ సమానంగా చూడాలని చాణక్య నీతి చెబుతుంది.