Best Web Hosting Provider In India 2024
Amaravati Capital Works : ఏపీలో కూటమి అధికారంలోకి రావటంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ పనుల సందడి షురూ అయింది. గత నాలుగేళ్లుగా పనులు పూర్తిగా నిలిచిపోవటంతో… ఈ ప్రాంతమంతా చెట్లు, చెత్తతో దర్శనమిస్తోంది. అయితే తాజాగా వెలువడిన ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించటంతో అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి.
అమరావతిలో ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) అధికారులు తాజాగా కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి మరియు నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఏపీ సీఆర్డ్ఏ, అమరావతి స్మార్ట్ సిటీ పనులపై కూడా ఆరా తీశారు.
చెత్తతో పాటు చెట్లను తొలగించేందుకు 76 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యం పనులను చేపడుతున్నారు. రాయపూడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను కూడా అధికారులు పరిశీలించారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఉద్దండరాయునిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సీఆర్డీఏ కమిషన్ పరిశీలించారు. నిరంతరాయంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇక్కడ సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పించాలని ఆదేశించారు.
మరోవైపు ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు, హైకోర్టు నుంచి తుళ్లూరుకు వెళ్లే రోడ్డు, అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించిన రోడ్ల వెంట పనులు నడుస్తున్నాయి.
ఇక విద్యుత్ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు నిర్మించిన నిర్మాణాలు కనిపించే పరిస్థితి లేదు. పూర్తిగా పిచ్చిచెట్లు అలుముకుపోయాయి. దీంతో వీటన్నింటిని పూర్తిగా తొలిగించే పనులు నడుస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత…. అమరావతి పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇక సందేహాం లేదు….
పీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు ఏపీ రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా పోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి విక్టరీ తర్వాత….. ‘అమరావతి’ మళ్లీ ప్రాణం పోసుకోనుంది.
2019లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టిన తర్వాత… రాజధాని విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి మాత్రమే రాజధాని కాదని… మూడు రాజధానులను ఏర్పాటు చేస్తు్న్నట్లు ప్రకటించింది. దీంతో అమరావతి పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అక్కడ చేపట్టి నిర్మాణాలు కూడా వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ కార్యనిర్వహక రాజధానిగా, అమరావతి శాసనసభ రాజధాని అని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు. అందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికీ… న్యాయపరమైన చిక్కులతో వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది.
అయితే తాజాగా వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని చెప్పింది. కానీ టీడీపీ కూటమి భారీ విజయం సాధించటంతో…. అమరావతి శాశ్వత రాజధానిగా మారిపోనుంది. ఆగిపోయిన పనులన్నీ మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఇదే విషయంపై ఎన్నికల ప్రచారంలో కూటమిలోని పార్టీలు కూడా పదే పదే ప్రకటన చేశాయి. మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి.
తాజాగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావటంతో … ఏపీ రాజదాని ఏంటన్న ప్రశ్నకు పూర్తిస్థాయి సమాధానం దొరికినట్లు అయింది. ఏకైక రాజధానిగా అమరావతిలో మళ్లీ అభివృద్ధి పనులు కొనసాగనున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్