Best Web Hosting Provider In India 2024
AP EAPCET Results: ఏపీ ఈఏపీ సెట్ 2024 పేపర్ల మూల్యాంకనం కూడా ఇప్పటికే ముగిసి చాలా రోజులు కావస్తుంది. అయితే ఇటీవలి రాష్ట్రంలో జరిగిన అధికార మార్పు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడక పోవడంతో ఫలితాలు వెల్లడి మధ్యలోనే ఆగిపోయాయి.
ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలు కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగాయి. ఫలితాలు వెల్లడికి ప్రభుత్వ అనుమతి కోసం ఉన్నత విద్యా మండలి, సెట్ కన్వీనర్ ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 93.47 శాతం మంది పరీక్షలు రాశారు.
ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 2,74,213 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,58,373 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 94.22 శాతం మంది ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు రాశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 88,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 80,766 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 91.12 శాతం మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగ పరీక్షలు రాశారు.
ఫలితాలతో కౌన్సిలింగ్ తేదీలు ప్రకటన
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపిఈఏపీసెట్)-2024 ఫలితాలతో పాటు కౌన్సిలింగ్ తేదీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల అయ్యాయి. వీటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్ల మూల్యాంకన ప్రక్రియ కూడా ముగిసిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామా చేశారు. దీనివల్ల కూడా ఫలితాలు విడుదలలో జాప్యం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
జూన్ 4న ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటు కాలేదు. దీంతో ఈఏపీసెట్ ఫలితాలు ఆగాయి. ముఖ్యమంత్రిగా ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్