Best Web Hosting Provider In India 2024
వేసవి సెలవు అయిపోయాయి. ఇప్పటికే చాలా పాఠశాలలు క్లాసులు మెుదలుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. స్కూల్ మెుదటి రోజు పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైనది. ఎందుకంటే మీ పిల్లలు గురించి బాగా ఎంక్వైరీ చేయాలి. వారు ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నారో తెలుసుకోవాలి. ఇవే కాదు.. పేరెంట్-టీచర్ సమావేశాల్లో కూడా విద్యార్థుల గురించి తల్లిదండ్రులు టీచర్లకు కొన్ని ప్రశ్నలు వేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లల అధ్యాపకులతో సంభాషించడానికి, వారి విద్యాపరమైన పురోగతిపై మాట్లాడేందుకు, ఏవైనా సమస్యలు లేదా సవాళ్లను చర్చించడానికి ఇవి ముఖ్యమైన అవకాశాలు.
స్కూల్ ఫస్ట్ డే ఏం అడగాలో, ఏం అడగకూడదో తెలుసుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సానుకూల సహకారానికి ఇది దోహదం చేస్తుంది.
కిందటి ఏడాది మీ పిల్లల మొత్తం విద్యా పనితీరు గురించి విచారించండి. ఎంత మెరుగుదల చూపించారో అడగండి. క్లాసు రూములో విజయాలు, సవాళ్ల గురించి మాట్లాడండి. మీ బిడ్డ భవిష్యత్తు కోసం నేర్చుకునే చోటు పాఠశాల అని గుర్తుంచుకోండి. మీ పిల్లలకు ఏది ఉపయోగమో, ఏది ఉపయోగపడదో మీరు అర్థం చేసుకునే ఏకైక ప్రదేశం ఇది. ఈ ఏడాది ఎలాంటి లక్ష్యాలు పెడుతున్నారో అడగండి. వాటిని ఓ నోట్ బుక్ మీద రాసుకోండి. అకడమిక్ ఇయర్ అయ్యాక అందులో ఎంతవరకూ మీ పిల్లవాడు సాధించాడో తెలుసుకోవచ్చు.
మీ పిల్లవాడు పాఠాలు చెబుతుంటే ఎంతటి శ్రద్ధతో వింటున్నాడో కూడా ఎంక్వైరీ చేయాలి. తరగతి గదిలోని బోధనా పద్ధతులకు సరిపోతుందో లేదో చెక్ చేయండి. ఇంట్లో మీ పిల్లల అభ్యాసానికి ఎలా మద్దతు ఇవ్వాలనే దానిపై సూచనలు అడగండి. చాలా సార్లు పిల్లల నేర్చుకునే శైలి ఇంట్లో, పాఠశాలలో భిన్నంగా ఉంటుంది. ఇంటి దగ్గర ఎలా నేర్పించాలో దాని గురించి టీచర్లతో మాట్లాడండి.
తరగతి గదిలో మీ పిల్లల ప్రవర్తన, తోటి పిల్లలతో ఎలా ఉంటున్నారో విచారించండి. ప్రవర్తన లేదా చర్చలో ఏవైనా ముఖ్యమైన మార్పులు ఉన్నాయా అని అడగండి. పిల్లల విద్యలో చురుకుగా పాల్గొనే మార్గాలను చర్చించండి. స్వచ్ఛందంగా లేదా పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశాల గురించి అడగండి. వారిని ప్రోత్సహించేందుకు ఎలాంటి పనులు చేయాలో ఒక ఐడియా వస్తుంది.
కిందటి ఏడాది హోంవర్క్ మొత్తాన్ని మీ బిడ్డ ఎలా నిర్వహించాలో చర్చించండి. మంచి అధ్యయన అలవాట్లు, సమయ నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సలహాలను తీసుకోండి. ఇది మీ బిడ్డకు, మీకు సాయపడుతుంది.
పాఠశాలలో మీ బిడ్డ పాల్గొనే పాఠ్యేతర కార్యకలాపాల గురించి అడగండి. పిల్లల మొత్తం అభివృద్ధిపై ఈ కార్యకలాపాల ప్రభావం గురించి విచారించండి. వారికి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఒక్కసారి టీచర్లతో చర్చించండి.
చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏదైనా విద్యాపరమైన సవాళ్లకు ఉపాధ్యాయుడిని నిందించడం. ఇది మానుకోండి. లోపాలను ఎత్తిచూపడం కంటే సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టండి. మీ పిల్లల పనితీరును ఇతర విద్యార్థులతో పోల్చడం మానుకోండి. ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. పోలికలతో పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు.
స్కూలు జీవితంలో గ్రేడ్‌లు ముఖ్యమైనవి అయినప్పటికీ, వాటిపై మాత్రమే దృష్టి పెట్టవద్దు. అభ్యాస ప్రక్రియ, సవాళ్లు, అందరితో ఉండే విధానం గురించి కూడా టీచర్లను అడగండి.
చాలా మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పే విషయాలను లైట్ తీసుకుంటారు. ఉపాధ్యాయుల సూచనలపై శ్రద్ధ వహించండి. టీచర్లతో మీటింగ్‌లో ఓపెన్ కమ్యూనికేషన్, సహకారం, పిల్లల సమగ్ర అభివృద్ధిపై దృష్టి ఉంటుంది. ఆలోచనాత్మకమైన ప్రశ్నలను అడగడం, పిల్లలను ఎలా బాగు చేయాలనే చర్చల ద్వారా ఉపాధ్యాయులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. పిల్లల విద్యా ప్రయాణానికి తోడ్పడవచ్చు. పిల్లలతో స్కూలు మెుదటి రోజు మీరు కచ్చితంగా వెళ్లి టీచర్లతో గతేడాది గురించి చర్చించండి. ఈ ఏడాది ఎలా ప్లాన్ చేస్తారో అడగండి.