Best Web Hosting Provider In India 2024
విశాఖపట్నం: రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ కు సంబంధించిన ఢిల్లీలో కర్టెన్‌రైజ్ కార్యక్రమాన్ని నిర్వహించామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహించనున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, 49 దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో కొన్ని దేశాలకు సత్సంబంధాలు ఉన్నాయని, వివిధ దేశాలకు చెందిన కంపెనీల పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..
దేశంలోనే 8వ పెద్ద రాష్ట్రం ఆంధ్రపదేశ్. 974 కి.మీ సముద్ర తీరం ఉంది. జీఎస్‌డీపీలో 11.43% దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2021-22లో 19 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. పోర్టు ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కానీ, సస్టైయిన్‌బుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సాధించటంలో నీతి అయోగ్ కూడా ఆంధ్రప్రదేశ్‌ను కీర్తించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబాసిడర్లు తమ దేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఒక ప్రాంతంలో, ఒక నగరానికే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. జిల్లాల్లో వనరులు వినియోగించుకోవాలని కార్యక్రమానికి వచ్చిన ప్రతినిధులకు వివరించటం జరిగింది. ఈ సందర్భంగా 11-12 నిమిషాల వీడియోను ప్రదర్శించాము.
ఏపీ అనువైన రాష్ట్రం
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్‌లు మంజూరు చేస్తే.. అందులో మూడు ఏపీకి మంజూరు అయ్యాయి. దీనిబట్టే రాష్ట్రంలో ఉన్న అవకాశాలు అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగలూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగలూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ల్లో 49వేల ఎకరాల పారిశ్రామిక భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ పెట్టడానికి వస్తే అన్నిరకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలో ప్రతి పరిశ్రమకు అవసరమైన మానవవనరులు ఉన్నాయి. ఉదాహరణకు విశాఖపట్నంకు 50 కి.మీ దూరంలో ఉన్న బ్రాండిక్స్, అపాచీ సంస్థల్లో స్థానికంగా ఉన్న మహిళలే పనిచేస్తున్నారు. బ్రాండిక్స్‌లో 18 వేల మంది, అపాచీలో 75% స్థానిక మహిళలు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభాలో 75% మంది పనిచేయగల మానవవనరులు మనకు ఉన్నాయి.
టూరిజం అభివృద్ధిలో 3వ స్థానం..
రాష్ట్రంలో 13 రంగాలపై ఫోకస్ చేయాలని గుర్తించడం జరిగింది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఎనర్జీ, ఐటీ-ఎలక్ట్రానిక్స్ సెక్టార్ తదితరాలను గుర్తించడం జరిగింది. ఎంఎస్‌ఎంఈలను మరింతగా ప్రోత్సహించమని సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు కల్పించవచ్చు. విశాఖపట్నం – కాకినాడ మధ్యన 650 చ. కి.మీ పీసీపీఐఆర్ కారిడార్ ఉంది. ఫార్మాలో ఇప్పటికే రెండు క్లస్టర్స్ ఉన్నాయి. దేశంలో మూడు బల్క్ పార్క్‌ల కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడితే.. దక్షిణ భారతదేశం నుంచి కేవలం ఆంధ్రప్రదేశ్‌కు ఆ అవకాశం దక్కింది. టూరిజం అభివృద్ధిలో మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 13 లక్షల మంది తెలుగువారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి ద్వారా రాష్ట్రానికి ఉన్న అనుబంధం వివరించాం. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చులు చాలా తక్కువని సీఎం వివరించారు.
రాష్ట్రంలో ఆరు పోర్టులతో పాటు కొత్తగా నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం రాబోతున్నాయి. త్వరలో మచిలీపట్నం, భావనపాడు పోర్టులు రాబోతున్నాయి. సముద్ర తీరం సద్వినియోగం చేయటానికి 9 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు చేయనున్నాం. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి ఉన్న అవకాశాలు వివరించాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తిరుపతి లాంటి క్టస్లర్లలో బిల్డింగ్, షెడ్డులు ఏర్పాటు చేశాం. తద్వారా వేగంగా వ్యాపారం చేసుకోవటానికి అవకాశాలున్నాయని రాయబారులు, వ్యాపార ప్రతినిధులకు వివరించాం. ఎంఎస్‌ఎంఈ సెక్టార్ కు సంబంధించి ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రంగాన్ని కాపాడటానికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉండదు. కోవిడ్ పరిస్థితుల్లోనూ చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈ సెక్టార్ కుదేలు అయిపోతే.. రూ.1900 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చిన ప్రభుత్వం మనది. ఈ రంగాన్ని ఆదుకుంటోందీ, రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చింది మా ప్రభుత్వమే. పవర్ సబ్సిడీలు కూడా రూ.1000 కోట్లు ఇచ్చాం. మొత్తంగా రూ.2900 కోట్లు సాయం ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రభుత్వం అందించింది.
త్వరలో విశాఖ నుంచి పరిపాలన..
రాబోయే నెలల్లో విశాఖపట్నం రాజధాని కాబోతోందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ అంశం మీద చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. రాజధానిపై బిల్లును తీసుకురాబోతున్నాం. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని. క్యాపిటల్ సిటీ అనే స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఇక అనుమానం ఎందుకు.? ముఖ్యమంత్రి విశాఖపట్నంకు వస్తే దానికి అవసరమైన మౌలిక వసతులు గుర్తించటం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు లేకపోతే.. ప్రైవేటు కార్యాలయాలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, లెజిస్లేచర్ క్యాపిటల్‌గా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలుకు కట్టుబడి ఉన్నాం. ఇందులో ఏ ఒక్కదానికీ విస్మరించే పరిస్థితి లేదు. జీవీఎల్ రాజ్యసభలోనే ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం ఏంటో చెప్పమనండి. రాజధాని, రాజధానులు అన్నది ప్రభుత్వ ఇష్టం. ఆయన పార్లమెంట్‌కు వెళ్తున్నారా? ఎక్కడికైనా వెళ్తున్నారా? విశాఖపట్నంలో ఏదైనా అభివృద్ధి చేద్దామన్నా ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో హెచ్‌ఎస్‌బీసీ దేని కింద ఇచ్చారో సమాధానం చెప్పండి. నోరుందని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మేస్తారనుకోవటం ప్రతిపక్షాల అమాయకత్వం.
అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగే
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణల్లో అర్థం లేదు. ఆయన చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాం. ఫోన్లలో కొత్తగా చాలా యాప్‌లు ఉన్నాయి. మీరు, నేను మాట్లాడుకుంటే.. అది నేను రికార్డ్ చేస్తే.. అది ట్యాపింగ్ అవుతుందా? రికార్డ్ అవుతుందా?. అవతల వ్యక్తి మాట్లాడింది పంపించి ఉండొచ్చు కదా!. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో మనవాడు బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియో, వీడియో సాక్షిగా దొరికాడు. తనకు ఇక్కడ భవిష్యత్ లేదనుకుంటే.. ఇలా లేనిపోనివి క్రియేట్ చేసి ప్రభుత్వంపై నెపం నెట్టాల్సిన అవసరం లేదు. ఎవరో థర్డ్‌పార్టీ ఫోన్‌కాల్ రికార్డు చేస్తే ప్రభుత్వానికి సంబంధమేంటి?
లోకేష్‌ను చూస్తే జాలేస్తుంది..
గడిచిన నాలుగు రోజులుగా లోకేష్ పాదయాత్ర చూస్తే జాలేస్తోంది. లోకేష్ టీడీపీకి కాబోయే నాయకుడు అని చంద్రబాబు మీద ఇంట్లో ఆడవారు అంతా ఒత్తిడి తెస్తున్నారు. కొడుకును ఇలా పంపేటప్పుడు చంద్రబాబు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఆ కార్యక్రమానికి చంద్రబాబు రాకపోవటం అనేది మావాడికి ఏమీ లేదన్నట్లుగా ఉంది. కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, రాజకీయాలకు వస్తే మామ లేదు, కొడుకు లేదు అన్నట్టు చంద్రబాబు తీరుంది. ఈ విషయం లోకేష్ పాదయాత్ర చూస్తే అనిపిస్తోంది.
సీట్ల కోసం బేరాలాడుకోవడమేంటి?..
2008 నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. 2011లో వైయస్ జగన్ రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 8 ఏళ్లలో అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ, పవన్ కల్యాణ్.. 25, 35 సీట్లు ఇస్తారా అని బేరాలు ఆడుకోవటం ఏంటి? నిజమైన నాయకుడుగా ఎదగాలి అనుకుంటే.. ఏదో ఒక పార్టీ స్థానాన్ని భర్తీ చేయాలి. అలా కాకుండా పవన్ కల్యాణ్ కాపుల్ని తీసుకెళ్లి.. చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికా?. 600 ఎకరాలు నాకు ఉన్నాయి అంటున్నారు కాబట్టి.. మీడియా సమక్షంలో ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టి జనసేనకు రాసిస్తాను.