Best Web Hosting Provider In India 2024

AP Minister Savitha : ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గో భవనంలో ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్,ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పథకాలపై మొదటి, రెండో సంతకాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని… ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశానన్నారు.
ఎన్టీఆర్ విదేశీ విద్య స్కీమ్….
2014-19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామన్నారు.ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు,హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు,రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను 106 కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే అన్నారు.రాష్ట్రం బాగుండాలనే తపన కలిగిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
రెవెన్యూశాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్
రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవలు విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి చేయనున్నట్టు తెలిపారు.ప్రస్తుతం భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రెవెన్యూ శాఖలో జవాబు దారీ తనాన్ని పెంపొందించే విధంగా అవసమరైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. విధ రకాల సర్టిఫికెట్లకై ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో సర్టిఫికెట్ల జారీకి తగిన కార్యాచరణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.భూరికార్డుల్లో ఎవరికి వారు నచ్చిన విధంగా మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలో రెవెన్యూ రికార్డుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కోర్టు కేసుల సమర్ధ నిర్వహణకు అన్లైన్ రెవెన్యూ కోర్టు విధానాన్ని తీసుకురానున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగై సేవలు సకాలంలో అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్ర చిన్న ,మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సచివాలయంలోని ఐదవ భవనంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత శాఖాపరమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను అత్యంత క్రమ శిక్షణతో నిర్వహిస్తానని మంత్రి అన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్