Rat in Chutney: చట్నీలో ఎలుక ఘటనపై మంత్రి ఆగ్రహం, హాస్టళ్లలో తనిఖీ చేయాలనీ మంత్రి దామోదర ఆదేశం

Best Web Hosting Provider In India 2024

Rat in Chutney: చట్నీలో ఎలుక స్విమ్మింగ్ దృశ్యాల వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల్ని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్‌ జేఎన్‌టియూ క్యాంపస్‌లో మంగళవారం వెలుగు చూసిన ఎలుక వ్యవహారంపై దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేఎన్టీయూ లో జరిగిన ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక ఆర్డిఓ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను మంత్రి ఆదేశించారు. విచారణ చేపట్టి వెంటనే నివేదిక ను సమర్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్ క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్ హాస్టల్ క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి కోరారు.

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్ లలో నిరంతరం తనిఖీ నిర్వహించాలన్నారు. ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని మంత్రి పేర్కొన్నారు.

కళాశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అదనపు కలెక్టర్..…

సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ మాధురి మంగళవారం సుల్తాన్ పూర్‌ జేఎన్టీయూ కళాశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధురి విద్యార్థులతో మాట్లాడుతూ కళాశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

హాస్టల్లో కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం,కళాశాలలో శానిటేషన్ పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమె ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టు ను రద్దు చేయాలనీ కళాశాల యజమాన్యానికి సూచించారు. ఈ క్రమంలో కళాశాలలో శానిటేషన్ కార్యక్రమం పై దృష్టి పెట్టడంతోపాటు,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు.

వెంటనే నైపుణ్యం గల వంట సిబ్బందిని ఏర్పాటు చేయాలని కళాశాల యాజమాన్యానికి ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఏం జరిగిందంటే….

సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్‌ జేఎన్‌టియూ క్యాంపస్ మంగళవారం ఉదయం హాస్టల్ మెస్‌లో చట్నీలో ఎలుక కనిపించింది. ఉదయం కాలేజీ తరగతులకు వెళ్లే ముందు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ చేయడానికి వచ్చిన సమయంలో చట్నీ గిన్నెల్లో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి విద్యార్ధులు ఖంగుతిన్నారు.

చట్నీ పాత్రపై ఎలాంటి మూత లేకపోవడంతో అందులో ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు ఎలుక విశ్వప్రయత్నాలు చేసింది. హాస్టల్ మెస్ నిర్వాహకులు పారిశుధ్యం పాటించకపోవడంతోనే ఇలా జరిగిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

నాలుగైదు రోజుల క్రితం విద్యార్ధులు భోజనం నాణ్యత పై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్ధుల్ని బయట నుంచి తెచ్చుకునే భోజనానికి కూడా భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లోకి బయటి వారిని అనుమతించేది లేదని చెబుతున్నారు. మరోవైపు హాస్టల్లో నాసిరకం భోజనాలపై కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. చట్నీలో ఎలుక ఈదుతున్న దృశ్యాలు వైరల్‌‌గా మారాయి.

మంత్రి ఆదేశాలతో కాలేజీ రిజిస్ట్రార్, ఆర్డీఓ, జిల్లా అధికారులు విద్యార్దులతో మాట్లాడారు. మెస్ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు వడ్డించే వంట పాత్రలో ఎలుక పడలేదని, కడిగేందుకు సిద్ధం చేసిన గిన్నెలో పడిందని నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

WhatsApp channel

టాపిక్

Ts MinistersTrending TelanganaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024