Rythu Bharosa : నిజమైన రైతులకే ‘రైతు భరోసా’..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ

Best Web Hosting Provider In India 2024

ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ సమావేశంలో కేబినెట్ సభ్యులు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు వివిధ వర్గాల ప్రముఖులు హాజరై రైతు భరోసా అమలుకు అభిప్రాయాలు, సూచనలు చేశారు.

సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతామన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన భృతికి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు.

గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టిన రైతుబంధు నిధులను సమయానుకూలంగా ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనందున, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటు బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు.

పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ నియామకం చేసిందన్నారు. ఈ సబ్ కమిటీలో తనతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు లు సభ్యులుగా ఉన్నామన్నారు. రైతు భరోసా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి, ఈ పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేసి, ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించామన్నారు.

నిజమైన రైతులకు భరోసా..

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…. నిజమైన రైతులకు రైతు భరోసా అందించడానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిపారు. పేద రైతులకు సహకారం అందించడానికి ప్రభుత్వం ఓపెన్ మైండేడ్ గా పని చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ఆలోచనల మేరకు నిజమైన రైతుకు రైతు భరోసా అందిస్తామన్నారు. గతంలోలా లోపాలు, ఆర్థిక నష్టాలు తలెత్తకుండా, కష్టపడ్డ చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి అన్నారు.

ప్రజాభిప్రాయ సేకరంతోనే..

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… రైతు భరోసా చెల్లింపులకు ప్రజల అభిప్రాయ సేకరణ చేపడుతున్నామని అన్నారు. నిజమైన రైతును ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, రాష్ట్ర ప్రజలు వివిధ రూపాల్లో చెల్లించిందేనని ఆయన అన్నారు.

గతంలో ఏ పథకం చేపట్టిన ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదని, నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేవారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రతి పైసాపై లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఓపెన్ గా డిబేట్ చేసి, ప్రజలు, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, ఎవరికి సాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో వివరాలు సేకరించి అమలు చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్రంలోని మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో రైతులు, ప్రముఖులు, ప్రజల అభిప్రాయాలు సేకరించి…. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి, నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

అభిప్రాయాల సేకరణ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులు, కౌలు రైతులు, డాక్టర్లు, అడ్వకేట్, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, పలువురు వారి వారి అభిప్రాయాలను సమావేశంలో వివరించారు. సాగు భూమికే భరోసా అందజేయాలని, చిన్న సన్న కారు రైతులకు న్యాయం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్యాక్స్ చెల్లింపుదారులను మినహాయించాలని, ఏజెన్సీ ప్రాంతంలో పట్టాలేని రైతులకు రైతు భరోసా అందించాలని కొందరు అభిప్రాయపడ్డారు.

అన్ని పంటలకు బోనస్ అందించాలని.. కౌలు రైతులకు బోనస్, పట్టా రైతులకు రైతు భరోసా అందించాలని, కౌలు రైతుల గురించి ఆలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే లు మట్టా రాగమయి, రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అధికారులు విజయనిర్మల, బాబూరావు, అధికారులు, రైతులు, వివిధ వర్గాల వారు, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

WhatsApp channel

టాపిక్

Rythu BharosaRythu Bandhu SchemeTelangana NewsTrending TelanganaMallu Bhatti VikramarkaPonguleti Srinivas ReddyThummala Nageswara Rao
Source / Credits

Best Web Hosting Provider In India 2024