TG Registrations : రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు – కారణం ఇదే…!

Best Web Hosting Provider In India 2024

Registrations in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత ఈ సమస్య తలెత్తింది. దీంతో చాలాచోట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.

సాంకేతిక సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈకేవైసీ వెరిఫికేషన్‌కు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు.

ప్రభుత్వం ప్రకటన…

రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయని ముఖ్యమంత్రి సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. UIDAI నెట్ వర్కింగ్‌ ఢిల్లీలోని సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక కారణంగా ఈ సమస్య తలెత్తిందని వివరించారు. ఫలితంగా ఆధార్ ఆధారిత ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ వంటి సేవలు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

ఈ ప్రభావం తెలంగాణలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖ సర్వీసులపైన కూడా పడిందని వివరించారు. రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి అయినందున రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయని స్పష్టం చేశారు. ఆధార్‌ ఆన్‌లైన్‌ సాంకేతిక కారణాలతో గురువారం నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూలు చేయడం జరుగుతుందని వెల్లడించారు.

పెరగనున్న ఛార్జీలు:

మరోవైపు తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అధ్యయన ప్రక్రియ కూడా నడుస్తోంది. 

నిబంధనల ప్రకారం ప్రతి ఏటా భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. అయితే ప్రతీ ఏటా ధరల సవరణలు జరగడంలేదు. ఈ విషయంపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి… మార్కెట్ విలువలను బట్టి ధరల సవరణ చేపట్టాలని ఇటీవలే అధికారులను ఆదేశించారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ధరల సవరణలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడంతో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాన్ని వృద్ధి చెందుతుందన్నారు.

ముందుగా జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ వ్యవసాయేతర పనులకు అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను లెక్కగట్టి మార్కెట్‌ విలువను సవరిస్తారు. భూముల ధరల వ్యత్యాసాలను పరిశీలిస్తారు. జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు ఆ రీతుల్ని గుర్తించి ధరలు నిర్ణయిస్తారు. అలాగే వ్యవసాయ భూములకు రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనల మేరకు బహిరంగ మార్కెట్‌ ధరలు నిర్ణయిస్తారు.

పట్ణణ ప్రాంతాల్లో వివిధ మార్గాల్లో మార్కెట్ విలువ నిర్ణయిస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి భూముల విలువను నిర్ణయిస్తారు. కమర్షియల్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల ప్రాంతాల్లో మౌలిక సదుపాయల అనుగుణంగా విలువ ఉంటుంది. కాలనీలు, మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో పాత విలువతో పోల్చి సవరణ చేస్తారు. ఇటీవల మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో చేరిన గ్రామాలకు స్థానిక విలువను బట్టి మార్కెట్ ధరలు నిర్ణయిస్తారు.

సర్కార్ నిర్ణయం నేపథ్యలో…. జులై 1 నుంచే సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకుంటున్నారు. ఇందుకు జూలై 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జులై 24వ తేదీన వాల్యూ ఫైనల్ అప్రూవల్​ ప్రకటిస్తారు.జులై 31వ తేదీన డేటాను ఎంట్రీ చేస్తారు. ఆగస్టు 1 నుంచి–మార్కెట్ వాల్యూ పెంపు నిర్ణయం అమల్లోకి వస్తాయి. కొత్త ధరల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తుది నిర్ణయం అమలుకు ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది.

WhatsApp channel

టాపిక్

Telangana NewsGovernment Of TelanganaReal Estate
Source / Credits

Best Web Hosting Provider In India 2024