Ambani wedding food: అంబానీ పెళ్లిలో వడ్డించిన పాలక్ చాట్, కొబ్బరి బూరెలు ఇంట్లో ఇలా చేసేయండి..

Best Web Hosting Provider In India 2024

అంబానీల పెళ్లి విందులో కొన్ని వేల రకాల వంటకాలు వడ్డించారు. ఆ విందు మెన్యూలో ఉన్న కొబ్బరి బూరెలు, పాలక్ చాట్ మనం కూడా ఇంట్లోనే సులువుగా రుచిగా చేసేయొచ్చు. వాటి తయారీ చూసేయండి.

1. కొబ్బరి బూరెలకు కావాల్సిన పదార్థాలు:

3 కప్పుల మైదా

పావు టీస్పూన్ పసుపు

3 చెంచాల వంటనూనె

2 కప్పుల బెల్లం

4 కప్పులు కొబ్బరి తురుము

సగం చెంచా యాలకుల పొడి

2 చెంచాల నెయ్యి

కొబ్బరి బూరెల తయారీ విధానం:

  1. ముందుగా పెద్ద గిన్నె తీసుకుని అందులో 3 కప్పుల మైదా, పసుపు వేసుకుని ఒకసారి పొడిపిండినే కలుపుకోవాలి.
  2. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండికన్నా మెత్తగా కలపాలి.
  3. కనీసం పది నిమిషాల పాటూ కలిపితే పిండి మెత్తగా, మృదువుగా అయిపోతుంది.
  4. ఇప్పుడు రెండు చెంచాల నూనె వేసుకుని కలిపి కనీసం అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
  5. కొబ్బరి మిశ్రమం తయారీ చేసుకోవాలిప్పుడు. దానికోసం ఒక కడాయి పెట్టుకుని అందులో బెల్లం వేసుకోవాలి. రెండు కప్పుల బెల్లానికి అరకప్పు నీళ్లు పోసుకోవాలి.
  6. బెల్లం కరిగిపోయేదాకా బాగా కలపాలి. కనీసం అయిదు నిమిషాల పాటూ మిశ్రమం ఉడికిస్తే చిక్కగా అయిపోతుంది. అందులో కొబ్బరి తురుమును కలిపేయాలి.
  7. ఈ రెండింటిని మరో 5 నిమిషాల పాటూ ఉడికించాలి. కాసేపటికి మిశ్రమం గట్టిపడుతుంది.
  8. ఇప్పుడు ఒక కవర్ లేదా అరటి ఆకు తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. పిండి ముద్దను కొద్దిగా తీసుకుని ఒత్తుకోవాలి. మధ్యలో కొబ్బరి మిశ్రమం ఉండ చేసుకుని పెట్టుకోవాలి. అంచులన్నీ మూసేయాలి.
  9. చేత్తో వీలైనంత సన్నగా నూనె రాసుకుంటూ బూరెల్లాగా ఒత్తుకుంటే చాలు. ఇప్పుడు పెనం పెట్టుకుని వేడెక్కాక ఈ బూరెలని వేసుకోవాలి. అంచుల వెంబడి నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. కొబ్బరి పూర్ణం బూరెలు రెడీ అయినట్లే.

2. పాలక్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

20 దాకా పాలకూర ఆకులు

2 పచ్చిమిర్చి తరుగు

1 కప్పు శనగపిండి

అరచెంచా అల్లం ముద్ద

తగినంత ఉప్పు

సగం చెంచా పసుపు

డీప్ ఫ్రై సరిపడా నూనె

1 చెంచా కారం

చిటికెడు గరం మసాలా

పెరుగు కోసం:

1 కప్పు పెరుగు

2 చెంచాల పంచదార

కొద్దిగా నల్లుప్పు

పాలక్ చాట్ తయారీ విధానం:

  1. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, పసుపు, కారం , పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముద్ద వేసుకుని కలుపుకోవాలి.
  2. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కాక.. పాలకూర ఆకులను అలాగే శనగపిండి మిశ్రమంలో ముంచి కడాయిలో నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  4. అవి రంగు మారి వేగిపోయాక తీసి పక్కన పెట్టుకుంటే పాలకూర పకోడీ రెడీ. వీటిని చాట్ లాగా ఎలా సర్వ్ చేయాలో చూడండి.
  5. పెరుగులో పంచదార, నల్లుప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి.
  6. ఒక ప్లేట్ లో పాలకూర పకోడీలను పెట్టుకోవాలి. వాాటి మీద తియ్యటి పెరుగు కొద్దిగా పోసుకోవాలి. కొద్దిగా పుల్లదనం కోసం చింతపండు చట్నీ, పుదీనా చట్నీ వేసుకోవాలి. మీద కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ చాట్ రెడీ.

 

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024