Best Web Hosting Provider In India 2024
నెల్లూరు: నగరంలోని నారాయణ రెడ్డి పేట, కోడూరుపాడు ప్రాంతాల వారికి వీలైనంత త్వరగా ఇళ్ల పట్టాలిప్పిస్తామని నెల్లూరు ఎంపీ, వైయస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. సీనియర్ వైయస్ఆర్ సీపీ నేత లచ్చారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది నారాయణరెడ్డిపేట, కోడూరుపాడు ప్రాంతాల నుంచి ఆదాల నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ ఆదాల మాట్లాడుతూ.. ఈ రెండు ప్రాంతాల నేతలతో గతంలో సయోధ్య కుదిర్చి, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని చెప్పారు. అయితే అప్పటి ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి వాటిని రద్దుచేసి, ఎన్నికల రాబోతున్న తరుణంలో మళ్లీ ఇచ్చారని, అది కూడా పూర్తిగా జరగలేదని అన్నారు. 2014లో తాను రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టానని గుర్తు చేశారు. అప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇంకా 300 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ పర్యటించి వివాదాలు లేని స్థలాన్ని పరిశీలించి, పట్టాలుగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. సీనియర్ నేత లచ్చా రెడ్డి మాట్లాడుతూ.. చేనేతలకు 9 అంకణాల స్థలమిస్తే దానిని ఆదాల ప్రభాకర్ రెడ్డికి చెప్పి 12 అంకణాలకు మార్పించామని గుర్తు చేశారు. కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, కార్పొరేటర్లు నాగరాజు, మేకల రామ్మోహన్ యాదవ్, అంజిరెడ్డి, సుధాకర్ యాదవ్, స్వర్ణ వెంకయ్య, నాగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పేర్నేటి కోటేశ్వర్ రెడ్డి, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు.