Lizard In Beer Bottle : బీర్ బాటిల్ లో బల్లి కళేబరం, అవాక్కైన కస్టమర్

Best Web Hosting Provider In India 2024

Lizard In Beer Bottle : మద్యం సేవించేందుకు బీర్ బాటిల్ కొనుగోలు చేసిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. తను కొనుగోలు చేసిన సీసాలో బల్లి కళేబరం, చెత్తా చెదారం కనిపించడంతో అవాక్కయిన ఆ యువకుడు వైన్ షాప్ ఓనర్లను నిలదీశాడు. దీంతో అప్పటికే బీర్ బాటిల్స్ కొనుగోలు చేసిన వాళ్లంతా ఆందోళన చెందగా, కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ లో బుధవారం చోటుచేసుకుంది.

బుధవారం మధ్యాహ్నం గూడూరు మండల కేంద్రంలోని శ్రీగణేశ్ వైన్ షాప్ లో స్థానిక యువకుడొకరు ఓ కంపెనీకి చెందిన బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. డబ్బులు చెల్లించిన అనంతరం షాప్ బయటకు వెళ్లిన ఆ యువకుడు బాటిల్ లో ఏదో చెత్త ఉన్నట్టుగా గమనించాడు. అనంతరం పరిశీలించి చూడగా అందులో బల్లి కళేబరం, ఇతర చిన్నచిన్న ప్రాణుల కళేబరాలు, చెత్తా చెదారం కనిపించాయి. దీంతో కంగు తిన్న ఆ యువకుడు ఏం చేయాలో తెలియక ఆ బీరు బాటిల్ ని మళ్లీ షాపు నిర్వాహకుడికి తిరిగి ఇచ్చాడు. బాటిల్ తో కళేబరాలు రావడం పట్ల నిర్వాహకులను నిలదీశాడు. దీంతో అప్పటికే ఆ షాప్ లో బాటిల్స్ కొనుగోలు చేసిన మద్యం ప్రియులు కూడా కంగు తిన్నారు. అనంతరం షాప్ నిర్వాహకులు ఆ యువకుడిని బతిమాలుకుని మరో బాటిల్ ఇచ్చి నచ్చజెప్పారు. అది తమ వద్ద జరిగిన తప్పిదం కాదని, అందులో చెత్తాచెదారానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని అతడికి నచ్చజెప్పి పంపించేశారు. దీంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.

గతంలో బీర్ బాటిల్ లో తేలు

బీరు సీసాల్లో చెత్తాచెదారం, చిన్న చిన్న ప్రాణుల కళేబరాలు దర్శనమిస్తున్న ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల మొదటి వారంలో మహబూబాబాద్ పట్టణంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలోని ఓ వైన్స్ షాప్ లో బీర్ బాటిల్ కొనుగోలు చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటికి బంధువులు వచ్చారని షాప్ లో బీర్ బాటిల్ కొనుగోలు చేసిన ఓ యువకుడు, ఇంటికి వెళ్లి ఓపెన్ చేసి చూడటంతో అందులో చెత్తా చెదారం కనిపించింది. దీంతో షాక్ అయిన ఆ యువకుడు మళ్లీ వైన్ షాప్‌కు పరుగులు తీశాడు. ఇదేంటని ప్రశ్నించడంతో వైన్ షాప్ సిబ్బంది తమకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధిత యువకుడు వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పట్లో అది వైరల్ గా మారింది.

కాగా జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో గతేడాది మరో సంఘటన కలకలం రేపింది. నర్మెట్టకు చెందిన కరుణాకర్, తన స్నేహితుడితో కలిసి మండల కేంద్రంలోని వైన్ షాప్ కు వెళ్లాడు. అక్కడ రెండు బీర్లు కొనుగోలు చేసి, పక్కనే ఉన్న హోటల్ లోకి వెళ్లి వాటిని ఓపెన్ చేశాడు. గ్లాసులో పోసుకుని తలా కొంచెం తాగడంతో దుర్వాసన వచ్చింది. దీంతో బీర్ బాటిల్ ను నిశితంగా పరిశీలించగా, అందులో తేలు కళేబరం కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన ఆ యువకులు వెంటనే వైన్ షాప్ నిర్వాహకులను నిలదీశారు. దీంతో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటుండగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsViral TelanganaTrending TelanganaLiquor
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024