
Best Web Hosting Provider In India 2024

Madhavan Apartment: బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ఇటీవల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. SquareYards.com సేకరించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం మాధవన్ ఈ ఆస్తిని రూ.17.5 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఏకంగా 4182 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు పార్కింగ్ ఏరియాలతో ఉండటం విశేషం.
మాధవన్ ప్రాపర్టీ ఎలా ఉందంటే?
ఈ ప్రాపర్టీ సిగ్నియా పెర్ల్ లో ఉంది. ఇదొక లగ్జరీ అపార్ట్‌మెంట్లను సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల కోసం అందించే భవన సముదాయం. ఈ ప్రాజెక్ట్ లగ్జరీ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ప్రీమియం సౌకర్యాలు, ఫీచర్లను అందిస్తుంది. జులై 22న ఖరారు చేసిన సేల్ డీడ్ కు రూ.1.05 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు స్క్వేర్ యార్డ్స్ తెలిపింది.
సంపన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో మాధవన్ కొత్త అపార్ట్ మెంట్ ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) ముంబైలోని అత్యంత శక్తివంతమైన, ప్రతిష్ఠాత్మక ఏరియాల్లో ఒకటిగా నిలుస్తోంది. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆర్ మాధవన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. శశికాంత్ దర్శకత్వంలో నయనతార, సిద్ధార్థ్ జంటగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా టెస్ట్ లో అతడు నటిస్తున్నాడు.
మాధవన్ బిజీ బిజీ
ఈ మధ్యే మాధవన్ సైతాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అతడు నెగటివ్ రోల్ పోషించాడు. అజయ్ దేవగన్, జ్యోతిక కూడా ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అతని పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకప్పుడు లవర్ బాయ్ గా తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో పేరు సంపాదించిన మాధవన్.. తర్వాత బాలీవుడ్ లోనూ త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలతో నిలదొక్కుకున్నాడు.
మాధవన్ మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించే రెండు సినిమాలకు ఓకే చెప్పడం విశేషం. ఇక లండన్ నేపథ్యంలో మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వం వహిస్తున్న ఒక ఫ్యామిలీ డ్రామా, కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న భారతీయ ఇంజనీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్, కరణ్ సింగ్ త్యాగి డైరెక్ట్ చేస్తున్న సి.శంకరన్ నాయర్ బయోపిక్ లో సహాయక పాత్ర, స్వాతి సింఘా డైరెక్షన్ లో ఓ సైన్స్-ఫిక్షన్ చిత్రం ‘జి’ లో అతను కనిపించనున్నాడు.